Vegetable Oils: మరో బాదుడు తప్పదా..! పెరగనున్న వంట నూనెల ధరలు..?
వంట నూనెతో సహా దిగుమతి చేసుకునే వస్తువులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని ప్రధాని రేంద్ర మోదీ దేశ ప్రజలను కోరిన సంగతి తెలిసిందే.
- Naveen
- Published on- May 18, 2026 / 07:50 PM IST
Vegetable Oils: దేశ ప్రజలకు ధరల పోటు తప్పేలా లేదు. వంట నూనెల ధరలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. దీనికి కారణం కేంద్రం తీసుకోబోయే నిర్ణయమే. వంట నూనెలపై దిగుమతి సుంకాలను పెంచే ప్రతిపాదనను కేంద్రం పరిశీలిస్తోందని సమాచారం.
స్థానిక రైతులకు మద్దతివ్వడం, రూపాయిపై ఒత్తిడిని తగ్గించడం కోసం వంట నూనెలపై దిగుమతి సుంకాలను పెంచే ప్రతిపాదనను భారత ప్రభుత్వం పరిశీలిస్తోంది. వంట నూనెలపై అధిక దిగుమతి పన్నులు.. రైతులు తమ పంటలకు మెరుగైన ధరలు పొందేందుకు సాయపడతాయా, అలాగే భారీ సరుకుల దిగుమతులతో ముడిపడి ఉన్న విదేశీ మారక ద్రవ్య ప్రవాహాలను అరికట్టగలవా అనే విషయాన్ని అధికారులు సీరియస్ గా పరిశీలిస్తున్నారు.
ఈ ఏడాది ఆసియాలో రూపాయి అత్యంత బలహీనమైన కరెన్సీగా కొనసాగుతోంది. వంట నూనెలు, ఎరువులు, బంగారం, ముడి చమురు వంటి దిగుమతి చేసుకునే వస్తువులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్న తరుణంలో ఈ చర్చలు జరుగుతున్నాయి. ఈ నెల ప్రారంభంలో వంట నూనెతో సహా దిగుమతి చేసుకునే వస్తువులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని ప్రధాని రేంద్ర మోదీ దేశ ప్రజలను కోరారు. అంతేకాదు అనవసరమైన దిగుమతులను అరికట్టేందుకు గత వారం బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని 15 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే.
భారతదేశం తన వంట నూనె అవసరాలలో దాదాపు 60% దిగుమతి చేసుకుంటుంది. తద్వారా ప్రపంచంలోనే వంట నూనెల అతిపెద్ద కొనుగోలుదారుగా ఉంది. దిగుమతి సుంకాలలో ఏ పెరుగుదల అయినా ప్రధానంగా ఇండోనేషియా, మలేషియా, అర్జెంటీనా, బ్రెజిల్, రష్యా, యుక్రెయిన్ నుండి దిగుమతి అయ్యే పామాయిల్, సోయాబీన్, సన్ ఫ్లవర్ నూనెల రవాణాను ప్రభావితం చేయొచ్చు.
పశ్చిమాసియా సంఘర్షణతో ధరల పోటు..
ప్రపంచవ్యాప్తంగా ఆహార ధరలు వేగంగా పెరుగుతున్న తరుణంలో ఈ ప్రతిపాదన కూడా వచ్చింది. ఇరాన్ సంఘర్షణ సరఫరా గొలుసులకు అంతరాయం కలిగించి వంట నూనెలు, ధాన్యాలు, మాంసం ఉత్పత్తుల ధరలను పెంచింది.
ప్రపంచంలో అత్యంత విస్తృతంగా ఉపయోగించే వంట నూనె అయిన పామాయిల్.. సంఘర్షణ ప్రారంభమైనప్పటి నుండి సుమారు 12% పెరిగింది. పెరుగుతున్న ఇంధన వ్యయాలను భర్తీ చేసుకునే ప్రయత్నంలో భాగంగా ఇండోనేషియా, మలేషియాలో బయో ఫ్యూయల్ ఉత్పత్తి పెరగడం కూడా ఈ పెరుగుదలకు పాక్షికంగా కారణమైంది. అయితే, దిగుమతి సుంకాలను పెంచడానికి భారత్ తీసుకోబోయే చర్య కొనుగోళ్లను నెమ్మదింపజేసి, ఇటీవలి ధరల పెరుగుదలను అదుపు చేయగలదు.
కాగా, దిగుమతి సుంకాల పెంపుపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. దేశీయ ధరలను తగ్గించి, ప్రాసెసర్లకు ఉపశమనం కల్పించే ప్రయత్నంలో భాగంగా గత సంవత్సరం ముడి పామ్, సోయాబీన్, సన్ ఫ్లవర్ నూనెలపై ప్రాథమిక దిగుమతి సుంకాన్ని 20% నుండి 10%కి తగ్గించింది కేంద్రం. సుంకం తగ్గింపు వల్ల కలిగే ప్రయోజనాలను వినియోగదారులకు అందించాలని పరిశ్రమను కోరింది ప్రభుత్వం.
ఇదిలా ఉండగా, పెరుగుతున్న ముడి చమురు ధరల ఒత్తిడి కారణంగా భారత రూపాయి మరింత బలహీనపడి, సోమవారం అమెరికా డాలర్‌తో పోలిస్తే 96.35 వద్ద రికార్డ్ కనిష్ట స్థాయికి పడిపోయింది.
Also Read: PF డబ్బుల కోసం ఇక టెన్షన్ లేదు.. EPFO కొత్త రూల్స్‌తో ఫాస్ట్ సెటిల్‌మెంట్!
