Rating For Buildings: ఏసీలు, ఫ్రిజ్‌లకే కాదు.. ఇకపై భవనాలకూ స్టార్ రేటింగ్.. 50 వేల నుంచి లక్ష వరకు..
ఇంట్లో వాడే ఏసీలు, ఫ్రిజ్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులకే కాకుండా.. ఇకపై పెద్ద పెద్ద భవనాలకు కూడా స్టార్ రేటింగ్(Rating For Buildings) వ్యవస్థ రాబోతోంది.
- V Santhosh Kumar
- Published on- July 17, 2026 / 10:04 AM IST
Central Government takes a key decision to introduce star ratings for buildings as well.
- ఇకపై భవనాలకూ స్టార్ రేటింగ్
- కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు
- ఇంధన పొదుపే ప్రధాన లక్ష్యం
Rating For Buildings: ఇంట్లో వాడే ఏసీలు, ఫ్రిజ్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులకే కాకుండా.. ఇకపై పెద్ద పెద్ద భవనాలకు కూడా స్టార్ రేటింగ్ వ్యవస్థ రాబోతోంది. దేశంలో భవనాల ద్వారా విద్యుత్ వినియోగం విపరీతంగా పెరుగుతుండటంతో, ఇంధన పొదుపును ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త ముసాయిదా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. జాతీయ స్థాయిలో ఒకే రకమైన సుస్థిర నిర్మాణ ప్రమాణాలను అమలు చేయడమే దీని ప్రధాన లక్ష్యం.
20 వేల చదరపు మీటర్ల భవనాలకు కొత్త రూల్స్:
తాజా ప్రతిపాదనల ప్రకారం.. 20 వేల చదరపు మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ నిర్మాణ విస్తీర్ణం కలిగిన కొత్త వాణిజ్య, కార్యాలయ, నివాస భవనాలకు ఈ నిబంధనలు వర్తిస్తాయి. భవనాల నిర్వాహకులు బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియన్సీ (బీఈఈ) గుర్తింపు పొందిన సంస్థలతో ఎనర్జీ ఆడిట్ చేయించుకుని రేటింగ్ సాధించాలి. ఈసీఎస్‌బీసీ ప్రమాణాల ఆధారంగా భవనాలకు త్రీ స్టార్, ఫోర్ స్టార్, ఫైవ్ స్టార్ రేటింగులు (Rating For Buildings)ఇస్తారు.
దరఖాస్తు రుసుము, నిబంధనలు:
ఈ నిబంధనల ప్రకారం.. సాధించిన స్టార్ రేటింగ్ వివరాలను భవనం వద్ద స్పష్టంగా ప్రదర్శించడంతో పాటు బ్రోచర్లు, ప్రచార సామగ్రిలోనూ పొందుపరచడం తప్పనిసరి. రేటింగ్ నమోదు కోసం నివాస భవనాలకు రూ. 50 వేలు, వాణిజ్య భవనాలకు రూ. 1 లక్ష దరఖాస్తు రుసుముగా నిర్ణయించారు. ఈ ముసాయిదాపై 21 రోజుల్లోగా ప్రజలు తమ అభ్యంతరాలు, సూచనలు తెలపవచ్చని కేంద్ర విద్యుత్ శాఖ పేర్కొంది.
