Sugar Prices: ఇథనాల్‌ ఉత్పత్తిలో చక్కెర.. ధరల పెరుగుదలకు కారణం అదేనా?.. కేంద్రం కీలక కామెంట్స్

దేశంలో చక్కెర ధరలు(Sugar Prices) పెరగడంపై కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ కీలక విషయాలను వెల్లడించింది.

Central govt clarified the rise in sugar prices to ethanol production.

  • చక్కెర ధరలపై కేంద్రం స్పష్టత
  • ఇథనాల్‌ మళ్లింపే కారణం కాదు
  • ధరల అదుపునకు ముమ్మర చర్యలు

Sugar Price: దేశంలో ఇటీవల చక్కెర ధరలు పెరగడంపై కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ స్పందిస్తూ కీలక విషయాలను వెల్లడించింది. పెట్రోల్‌లో కలిపే ఇథనాల్ ఉత్పత్తి కోసం చక్కెరను మళ్లించడం వల్లే మార్కెట్‌లో వీటి ధరలు పెరిగాయంటూ వస్తున్న విమర్శల్లో నిజం లేదని స్పష్టం చేసింది. దేశీయంగా చక్కెర దిగుబడి తగ్గడం, పండగల వేళ ప్రజల నుండి డిమాండ్ భారీగా పెరగడమే ప్రధాన కారణాలని పేర్కొంది. దీనితో పాటు అంతర్జాతీయ సరఫరాల్లో అంతరాయం, పంట నష్టం, ఊహాగానాల వల్ల కొంతమంది వ్యాపారులు అక్రమంగా నిల్వలు పెంచడం కూడా ధరల పెరుగుదలకు దోహదం చేశాయని వెల్లడించింది.

ED Raids: వివేకా హత్య కేసులో ED బిగ్ అప్‌డేట్.. అవినాష్ రెడ్డి ఇంట్లో రూ.24 లక్షలు స్వాధీనం

ధరల నియంత్రణకు ముమ్మర చర్యలు:

విపక్షాల విమర్శలను తిప్పికొడుతూ.. ఇథనాల్ తయారీకి మళ్లించే చక్కెర(Sugar Prices) వాటా 2022-23లో 12 శాతంగా ఉండగా, 2025-26 నాటికి అది 9 శాతానికి తగ్గిందని గణాంకాలతో సహా వివరించింది. అంతేకాకుండా దేశంలో దాదాపు మూడోవంతు ఇథనాల్‌ను మొక్కజొన్న వంటి ఇతర ధాన్యాల నుంచే ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపింది. జులై 20న కిలో రూ.48.18గా ఉన్న సగటు ధర ఆగస్టు 20 నాటికి రూ.55.70కి చేరడంతో సాధారణ ప్రజలకు ఉపశమనం కలిగించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

దిగుమతి సుంకాల తగ్గింపు, నిల్వలపై పరిమితులు:

మార్కెట్‌లో చక్కెర లభ్యతను పెంచి ధరలను అదుపులోకి తీసుకురావడానికి ప్రభుత్వం నిల్వలపై కఠిన పరిమితులు విధించింది. అలాగే విదేశాల నుంచి చక్కెర దిగుమతులను సులభతరం చేసేందుకు దిగుమతి సుంకాలను సైతం తగ్గించినట్లు మంత్రిత్వ శాఖ ప్రకటించింది. రాబోయే రోజుల్లో మార్కెట్‌లో సరఫరా పెరిగి ధరలు సాధారణ స్థితికి చేరుకుంటాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.