ESMA Representative Image (Image Credit To Original Source)
ESMA: ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంతో మిడిల్ ఈస్ట్ లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. యుద్ధం కారణంగా చమురు, గ్యాస్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోంది. పలు దేశాల్లో చమురు, గ్యాస్ కొరత ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో భారత ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.
దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్‌కు కృత్రిమ కొరత సృష్టించకుండా కీలక నిర్ణయం తీసుకుంది. వీటి సరఫరాకు అంతరాయం కలగకుండా, పంపిణీ సమానంగా జరిగేలా కేంద్రం అత్యవసర చర్యలకు దిగింది. ఇందులో భాగంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆయిల్ రిఫైనరీ కంపెనీలపై (చమురు శుద్ధి సంస్థలు) ఎస్మాను (ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్-ESMA)ను ప్రయోగించింది. LPG ఉత్పత్తి పెంచాలని ఆయిల్ రిఫైనరీ కంపెనీలను ఆదేశించింది. దేశీయ సరఫరాలకే ప్రాధాన్యం ఇవ్వాలని తేల్చి చెప్పింది. డొమెస్టిక్ గ్యాస్, ఎరువుల ఫ్యాక్టరీలు, పవర్ ప్లాంట్లకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేసింది. అత్యవసర పరిస్థితుల్లో గ్యాస్ నిల్వలు తగ్గకుండా, కృత్రిమ కొరత సృష్టించకుండా ఉండేందుకు కేంద్రం ఈ చర్యలు చేపట్టింది.
రిఫైనరీల్లో ఉత్పత్తయ్యే ప్రొపేన్, బ్యూటేన్ గ్యాస్ నిల్వలను కేవలం వంట గ్యాస్ తయారీకే వాడాలని, పెట్రో కెమికల్స్ తయారీకి మళ్లించకూడదని ప్రభుత్వం ఆదేశించింది. ఉత్పత్తి అయిన మొత్తం గ్యాస్‌ను కేవలం ప్రభుత్వ రంగ సంస్థలైన ఐఓసీ, బీపీసీఎల్, హెచ్ పీసీఎల్ లకు మాత్రమే విక్రయించాలని స్పష్టం చేసింది. ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే ఎస్మా చట్టం కింద క్రిమినల్ చర్యలు తీసుకుంటామని కేంద్రం హెచ్చరించింది.
కాగా.. గృహ అవసరాలకు ప్రాధాన్యం ఇస్తూ కమర్షియల్ గ్యాస్ సరఫరాపై ప్రభుత్వం ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. దీని వల్ల బెంగళూరు, చెన్నై, ముంబై వంటి నగరాల్లో కమర్షియల్ సిలిండర్ల కొరత ఏర్పడింది. సరఫరా నిలిచిపోవడంతో వందలాది హోటళ్లు మూతపడే స్థితికి చేరుకున్నాయి. దీంతో హోటళ్లను కూడా అత్యవసర సేవలుగా గుర్తించి గ్యాస్ సరఫరాను పునరుద్ధరించాలని హోటళ్ల అసోసియేషన్ కోరుతోంది.
మరోవైపు బ్లాక్ విక్రయాలను అరికట్టేందుకు సిలిండర్ల బుకింగ్ వ్యవధిని కేంద్రం పెంచింది. ప్రస్తుతం ఉన్న 21 రోజుల నుంచి 25 రోజులకు పెంచింది. ఇక దేశంలో పెట్రో ధరలు ఇప్పటికిప్పుడు పెరగబోవని హామీ ఇచ్చింది. చమురు కంపెనీల దగ్గర వచ్చే 6 నుంచి 8 వారాల వరకూ సరిపడినంత ముడి చమురు, శుద్ధి చేసిన పెట్రో నిల్వలు ఉన్నాయని తెలిపింది.
కేంద్ర ప్రభుత్వం 1955లో నిత్యావసర సరకుల చట్టాన్ని తెచ్చింది. ప్రజలకు అందుబాటు ధరల్లో నిత్యవసర సరకులు లభించేలా చూడటం, కృత్రిమ కొరతను నిరోధించడం, బ్లాక్ మార్కెటింగ్, నిల్వలను నియంత్రించడమే ఈ చట్టం ముఖ్య ఉద్దేశం.