భారీగా పెరిగిన ఉల్లిపాయల ధరలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కిలో రూ.80 నుంచి 100 వరకూ విక్రయిస్తున్నారు. మధ్యప్రదేశ్ లో అయితే కిలో ఉల్లిపాయలు రూ.120 అమ్మే పరిస్థితికొచ్చింది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఉల్లి ధరల్ని నియంత్రించేందుకు చర్యలు తీసుకోవటంపై దృష్టి సారించింది.
విదేశాలనుంచి ఉల్లిని దిగుమతి చేసుకుని ధరల్ని నియంత్రించేందుకు చర్యలు తీసుకుంది. ఆఫ్ఘనిస్థాన్, ఈజిప్టు, టర్కీ, ఇరాన్ వంటి దేశాల నుంచి ఉల్లిపాయల్ని దిగుమతి చేసుకుందుకు నిర్ణయం తీసుకుందని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఉల్లి ధరల పెరుగుదలపై సమీక్షించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా అధికారులు తెలిపారు. ఆఫ్ఘనిస్థాన్, ఈజిప్టు, టర్కీ, ఇరాన్ దేశాల నుంచి 80 నుంచి 100 కంటెనర్లను వెంటనే దిగుమతి చేసుకునేలా నిర్ణయంచామని తెలిపారు.