Windfall Tax Hike : కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. పెట్రోల్‌పై విండ్‌‌ఫాల్ టాక్స్ తగ్గింపు..

Windfall Tax Hike : డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయెల్‌పై విండ్‌ఫాల్ టాక్స్‌ను కేంద్రం పెంచింది. పెట్రోల్ పై తగ్గించింది.

Centre Hikes Windfall Tax on Diesel and ATF Reducing it On Petrol

  • పెట్రోల్‌పై విండ్‌‌ఫాల్ టాక్స్ తగ్గించిన కేంద్రం
  • డీజిల్, ఏటీఎఫ్ ఎగుమతులపై పెంపు
  • కొత్త ధరలు నేటి నుంచే అమల్లోకి!

Diesel Windfall Tax Hike : ప్రపంచ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరుగుతుండటం, పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ఎగుమతులపై విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను భారీగా పెంచిన కేంద్రం.. పెట్రోల్ ఎగుమతులపై మాత్రం పన్నును తగ్గించింది. కొత్త రేట్లు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి.

Also Read : బంగారం కొనేవాళ్లకు అదిరిపోయే శుభవార్త.. నిపుణుల కీలక సూచనలు.. ఏపీ, తెలంగాణలో నేటి ధరలు ఇవే..

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, అమెరికా-ఇరాన్ దేశాల మధ్య దాడులు, హర్ముజ్ జలసంధి ప్రాంతంలో వాణిజ్య నౌకల రాకపోకలకు అంతరాయం ఏర్పడే పరిస్థితుల నేపథ్యంలో చమురు సరఫరాపై ప్రభావం చూపుతున్నాయి. ఈ పరిణామాలతో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దేశంలో ఇంధన కొరత సమస్య తలెత్తకుండా, చమురు ఉత్పత్తులు దేశంలోనే ఎక్కువగా అందుబాటులో ఉండేలా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం డీజిల్, ఏటీఎఫ్ పై విండ్‌ఫాల్ ట్యా క్స్‌పెంచింది.

తాజా నిర్ణయం ప్రకారం డీజిల్ ఎగుమతులపై విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను లీటరుకు రూ.8.50 నుంచి రూ.15.50కు పెంచగా.. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF)పై లీటరుకు రూ.7.50 నుంచి రూ.14.50కు పెంచుతూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. మరోవైపు పెట్రోల్ ఎగుమతులపై విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను లీటరుకు రూ.4 నుంచి రూ.2.50కు తగ్గించింది. ఈ సవరించిన పన్ను రేట్లు నేటినుంచే అమల్లోకి వచ్చినట్లు కేంద్రం స్పష్టం చేసింది. ఇదిలాఉంటే.. ఈ పన్ను మార్పులు కేవలం ఎగుమతి చేసే ఇంధనంపైనే వర్తిస్తాయని కేంద్రం తెలిపింది. దేశీయంగా విక్రయించే పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాల్లో ఎలాంటి మార్పు చేయలేదు. అందువల్ల ప్రస్తుతం వినియోగదారులు చెల్లిస్తున్న రిటైల్ ఇంధన ధరలపై ఈ నిర్ణయం ప్రభావం చూపదని పేర్కొంది.

విండ్‌ఫాల్ ట్యాక్స్ అంటే ఏమిటి?

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా పెరిగినప్పుడు చమురు కంపెనీలకు అసాధారణంగా అధిక లాభాలు వస్తాయి. అలాంటి అదనపు లాభాల్లో కొంత భాగాన్ని ప్రభుత్వానికి అందించేందుకు విధించే ప్రత్యేక పన్నునే విండ్‌ఫాల్ ట్యాక్స్ అంటారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా 2022 జూలైలో కేంద్ర ప్రభుత్వం తొలిసారి ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. అనంతరం చమురు ధరలు తగ్గడంతో 2024లో దీన్ని పూర్తిగా ఎత్తివేసింది. అయితే 2026లో మళ్లీ అంతర్జాతీయ ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల పెరుగుదల నేపథ్యంలో ఈ పన్ను విధానాన్ని పునరుద్ధరించి, ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్షిస్తూ సవరిస్తోంది.