Jharkhand : ఝార్ఖండ్ రాజకీయాల్లో కీలక పరిణామం.. అమిత్ షాతో చంపయీ సోరెన్ భేటీ.. త్వరలో బీజేపీలోకి

ఝార్ఖండ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది. ఆ రాష్ట్ర మాజీ సీఎం, ఝార్ఖండ్ ముక్తిమోర్చా (జేఎంఎం) నేత చంపయీ సోరెన్ త్వరలో బీజేపీలో చేరబోతున్నారు.

Champai Soren

Champai Soren : అనుకున్నదే జరిగింది.. ఝార్ఖండ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది. ఆ రాష్ట్ర మాజీ సీఎం, ఝార్ఖండ్ ముక్తిమోర్చా (జేఎంఎం) నేత చంపయీ సోరెన్ ఆ పార్టీ అధినేత, సీఎం హేమంత్ సోరెన్ కు బిగ్ షాకిచ్చాడు. ఆయన బీజేపీలోకి చేరేందుకు సిద్ధమయ్యాడు. ఈ మేరకు ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో చంపయీ సోరెన్ భేటీ అయ్యారు. ఈ విషయాన్ని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ తన ట్విటర్ ఖాతాలో సోమవారం రాత్రి తెలియజేశారు. అమిత్ షాతో భేటీ అయిన ఫొటోను షేర్ చేశారు. ప్రముఖ ఆదివాసీ నాయకుడు చంపయీ సోరెన్ కేంద్ర మంత్రి అమిత్ షాను కలిశారు. ఆగస్టు 30న అధికారికంగా ఆయన బీజేపీలో చేరబోతున్నారంటూ హిమంత బిశ్వశర్మ ట్విటర్ లో పోస్టు చేశారు. కొద్దిరోజుల్లో ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ చంపయీ సోరెన్ బీజేపీలో చేరుతుండటం జేఎంఎం పార్టీకి గట్టి ఎదురుదెబ్బేనని చెప్పొచ్చు.

Also Read : చిక్కుల్లో ఆ మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. సీఎం పదవులకు పొంచి ఉన్న ముప్పు..!

భూకుంభకోణం కేసులో జేఎంఎం కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్ సోరెన్ ను ఈ ఏడాది జనవరి నెలలో ఈ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయన అరెస్టు అయిన కొద్దిరోజులకే అప్పటికే మంత్రిగా కొనసాగుతున్న చంపయీ సోరెన్ ఝార్ఖండ్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఐదు నెలల అనంతరం హేమంత్ సోరెన్ బెయిల్ పై బయటకు రావడంతో జూలై 3న చంపయీ తన పదవికి రాజీనామా చేశాడు. అయితే, అప్పటికే పార్టీలో చోటుచేసుకున్న పరిణామాలపై చంపయీ సోరెన్ తన అనుచరుల వద్ద అసంతృప్తిని వ్యక్తం చేశారు. దీంతో ఆయన జేఎంఎంను వీడుతున్నట్లు వార్తలు వచ్చాయి. గత పదిరోజుల క్రితం ట్విటర్ వేదికగా చంపయీ సోరెన్ స్పందించారు. తన సొంత మనుషులే తనని బాధపెట్టినట్లు పేర్కొన్నారు. రాజకీయాల నుంచి వైదొలగడం, కొత్తపార్టీ పెట్టడం, వేరే పార్టీలోకి వెళ్లడం వంటి మూడు ఆప్షన్లు తన ముందున్నాయని ఆ సమయంలో పేర్కొన్నారు. రెండు రోజుల వ్యవధిలోనే మరో ట్వీట్ చేస్తూ.. నేను రాజకీయాలను వీడటం లేదని చెప్పారు.

Also Read : Jharkhand Political Crisis : ఝార్ఖండ్‌లో వీడిన రాజకీయ అనిశ్చితి..! సీఎంగా చంపై సోరెన్‌కు రూట్ క్లియర్.. సుప్రీంలో హేమంత్ సోరెన్‌కు ఎదురుదెబ్బ

ఝార్ఖండ్ జేఎంఎంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై అప్పటికే బీజేపీ దృష్టిసారించింది. పార్టీ పట్ల చంపయీ సోరెన్ అసంతృప్తిని వ్యక్తం చేయడంతో ఝార్ఖండ్ ఎన్నికల సహఇంచార్జిగా ఉన్న అస్సాం సీఎం బిశ్వశర్మ చంపయీతో చర్చలు జరిపారు. దీంతో ఆయన్ను బీజేపీలో చేరేందుకు ఒప్పించారు. ఈ క్రమంలో గత మూడు రోజుల క్రితం బీజేపీ పెద్దలతో భేటీ అయ్యేందుకు చంపయీ ఢిల్లీకి వచ్చారు. అయితే ఆ సమయంలో బీజేపీలో చేరుతున్నట్లు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఆ వార్తలను ఖండించారు. అయితే, అమిత్ షాతో చంపయీ భేటీ అయిన ఫొటోను సోమవారం రాత్రి అస్సాం సీఎం బిశ్వశర్మ ట్విటర్ లో పోస్టు చేశారు. చంపయీ సోరెన్ ఈనెల 30న రాంచీలో బీజేపీలో అధికారికంగా చేరబోతున్నట్లు ఆయన ప్రకటించారు.

 

 

ట్రెండింగ్ వార్తలు