గుండెలను టచ్ చేశారు : చెప్పుతో చిన్నారుల సెల్ఫీ

  • Publish Date - February 5, 2019 / 04:51 AM IST

హైదరాబాద్ : చిరునవ్వులు చిందించే చిన్నారుల్ని చూస్తే మనసు ఆనందంతో నిండిపోతుంది. కల్మషం లేని వారి నవ్వులు..ఏ బాధ్యతలు లేని వారి స్వేచ్ఛ..పసి వయసైనా తమ చుట్టు ఏం జరుగుతుందో మాత్రం గమనిస్తు..అనుకరిస్తు..అన్నింటిని ఇట్టే పసిగట్టేసే వారి తెలివితేటలు అంతా చూడ ముచ్చటగా ఉంటుంది.  ఒక్కోసారి వారి చేష్టలు నవ్వు తెప్పిస్తుంటాయి. ముద్దులొలుకుతుంటాయి. అంతలోనే ఆశ్చర్యపరుస్తాయి. అదిగో అటువంటి ఫోటో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. ఈ చిన్నారుల ఫోటో అందరిని ఆకట్టుకుంటోంది. 

 

ఐదుగురు చిన్నారులున్న ఆ ఫొటోలో అందరూ చక్కటి  చిరునవ్వులు చిందిస్తున్నారు. వారిలో ఒక బాలుడు చెప్పు(స్లిప్పర్‌)తో సెల్ఫీ తీస్తున్నాడు.  ఈ ఫోటో  వైరల్ గా మారటంతో బాలివుడ్ నటులు అనుపమ్‌ ఖేర్, సునీల్ శెట్టి, అతుల్ కస్బేకర్‌ వంటి బాలీవుడ్ సెలబ్రిటీల దృష్టిలో పడింది. వారు ఆ ఫొటోను షేర్ చేస్తు..ఈ చిన్నారి బాలల సృజనాత్మకతకు బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా అభినందనలు తెలుపుతున్నారు. ‘మీరు ఎంచుకున్న దాని బట్టే మీరు సంతోషంగా ఉంటారు’ అని బాలీవుడ్ నటుడు బొమన్ ఇరానీ దానికి క్యాప్షన్ కూడా  ఇచ్చారు.
 

 ఈ విషయంలో అమితాబ్‌ బచ్చన్ మాత్రం కొద్దిపాటి అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఫొటోషాప్‌లో ఎడిట్ చేసిన చిత్రం కావొచ్చని..‘నేనిలా అంటున్నందుకు క్షమించమనీ..స్లిప్పర్‌ పట్టుకున్న చేయి, మరో చేయికి తేడా ఉన్నట్లు అనిపిస్తుంది’ అని అమితాబ్‌ ట్వీట్ చేశారు. కానీ చాలామంది నెటిజన్లు ఆయనతో ఏకీభవించడం లేదు. ‘అమిత్ జీ.. అది ఫొటో షాప్‌ చేసిన చిత్రం కాదు. నేను క్రాస్‌ చెక్‌ చేయించా. అది నిజమైందే’ అని కస్బేకర్‌, మరికొందరు నెటిజన్లు బిగ్‌బీకి సమాధానమిచ్చారు.  ఏది ఏమైనా స్వచ్చమైన నవ్వులతో ఉన్న ఈ సెల్ఫీ అందరినీ ఆకట్టుకుంటోంది.