టాయిలెట్ కు వెళ్లాలంటే వాటర్ కావాల్సిందే. కానీ ఒక్కచుక్క నీరు లేకుండా టాయిలెట్ వాడగలమా? నిరభ్యంతరంగా వాడుకోవచ్చంటున్నారు ఓ ఇంజనీర్. మధ్యప్రదేశ్ భోపాల్ కు చెందిన సివిల్ ఇంజనీర్ సతీష్ వాటర్ అవసరం లేని టాయిలెట్ ను తయారు చేశారు. ఇది వాడాలంటే ఒక్కచుక్క నీరు కూడా అవసంలేదంటున్నారు సతీష్. దీంతో ఎంతో నీటిని ఆదా చేయవచ్చంటున్నారు. సతీష్ రూపొందించిన ఈ టాయిలెట్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీరాజ్ నిర్వహించిన ప్రదర్శనలో ఉత్తమ పురస్కారాన్ని కూడా అందుకుంది.
మరి నీటిని ఆదా చేసే ఈ వినూత్న టాయ్ లెట్ గురించి తెలుసుకుందాం..మాప్‌కాస్ట్స్ ఇన్నోవేషన్స్ ప్లాన్ కింద సతీష్ ఈ టాయిలెట్‌ను తయారుచేశారు. ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ..తాము ఉండే ప్రాంతంలో తీవ్రమైన నీటి సమస్య ఉందనీ..రోజూ తన భార్య అరవింద తమ ఇంట్లోని టాయిలెట్‌లో వాటర్ ఫిల్ చేసేందుకు ఇబ్బందులు పడుతుంటాన్ని గమనించిన తనకు వాటర్ అవసరం లేని టాయిలెట్‌ను తయారు చేయాలనుకున్నానని తెలిపారు.అలా తనకు వచ్చిన ఆలోచన కార్యరూపమే ఈ టాయిలెట్.
దీని కోసం మొదటిగా..తక్కువ నీటిని వినియోగించే టాయిలెట్ తయారు చేశారు. అది చూసి సతీష్ భార్య అరవింద సంతృప్తి చెందలేదు. అస్సలు నీటి అవసరమే లేని టాయిలెట్ తయారు చేయమని చెప్పింది. దీంతో మరో ప్రయత్నంచేశారు సతీష్. ఈ ప్రయత్నంలో ఒక్క చుక్క కూడా నీటి అవసరం లేకుండా వాడుకునేలా టాయిలెట్ ను తయారు చేశారు సతీష్.
ఈ టాయిలెట్ సీటును 8 ఇంచుల డయామీటర్ పైప్‌తో తయారుచేశారు. దీనిని వినియోగించే మందు వేస్ట్ పేపర్‌తో రూపొందించిన ఒక పౌచ్ దగ్గర ఉంచుకోవాలి. టాయిలెట్‌కు అమర్చిన లీవర్ నొక్కగానే వ్యర్ధాలతో పాటు దుర్వాసన కూడా సీటు కిందనున్న చాంబర్‌లోనికి వెళ్లిపోతుంది. ఆయిల్ కోటింగ్ ఉండటంతో టాయిలెట్ మొత్తం క్లీన్ అయిపోతుంటుంది. దాన్ని వినియోగించిన తరువాత కూడా నీరు వాడలేదు అనే విషయమే తెలీదు. అంత క్లీన్ గా అయిపోతుందన్నారు సతీష్.
రైళ్లలో ఉండే బయో టాయిలెట్‌లలో నీటిని వాడాల్సి వస్తుంది. కానీ సతీష్ రూపొందించిన ఈ టాయిలెట్ కు అస్సలు నీటి అవసరమే ఉండదంటున్నారు. ఈ టాయిలెట్ వినియోగం ద్వారా సంవత్సరానికి 15 వేల లీటర్ల నీటిని ఆదా చేయవచ్చని చెబుతున్నారు సివిల్ ఇంజనీర్.