CJP Party: సీజేపీ పార్టీ కోటి విరాళంపై అనుమానాలు.. అభిజిత్ దీప్కే తండ్రి ఆర్థిక పరిస్థితిపై విచారణ.. దర్యాప్తుకు డిమాండ్
కాక్రోచ్ జనతా పార్టీ(CJP Party) ఏర్పాటు చేసిన లీగల్ డిఫెన్స్ ఫండ్‌కు రూ.1 కోటి విరాళం ప్రకటించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
- V Santhosh Kumar
- Published on- August 2, 2026 / 09:29 AM IST
Cjp legal defense one crore fund controversy rti complaint election commission gst
- సీజేపీ లీగల్ ఫండ్‌పై ఫిర్యాదు
- రూ.1 కోటి విరాళంపై అనుమానాలు
- ఈసీ, జీఎస్టీ దర్యాప్తునకు డిమాండ్
CJP Party: కాక్రోచ్ జనతా పార్టీ ఏర్పాటు చేసిన లీగల్ డిఫెన్స్ ఫండ్‌కు రూ.1 కోటి విరాళం ప్రకటించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నీట్ పేపర్ లీక్ ఆందోళనల్లో కేసులు ఎదుర్కొంటున్న నిరసనకారులకు న్యాయ సహాయం అందించేందుకు సీనియర్ న్యాయవాది, రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ ఈ భారీ మొత్తాన్ని ప్రకటించిన నేపథ్యంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిధుల లావాదేవీల వ్యవహారంతో పాటు సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే, ఆయన కుటుంబ ఆర్థిక స్థితిగతులపై సమగ్ర విచారణ జరపాలని సూరత్‌కు చెందిన ఆర్టీఐ కార్యకర్త అమిత్ తివారీ డిమాండ్ చేస్తూ ఎన్నికల సంఘం, కేంద్ర జీఎస్టీ అధికారులకు లేఖలు రాశారు.
నిబంధనల ఉల్లంఘన ఆరోపణలు – ఈసీ దృష్టికి వ్యవహారం:
సీజేపీ(CJP Party) రిజిస్టర్ కాని సంస్థ అయినప్పటికీ ఒక రాజకీయ పార్టీ తరహాలో కార్యకలాపాలు నిర్వహిస్తూ నిధులు సమీకరిస్తోందని అమిత్ తివారీ ఆరోపించారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 29A కింద ఈ సంస్థ రాజకీయ పార్టీగా నమోదైందో లేదో ఎన్నికల సంఘం పరిశీలించాలని కోరారు. ఒకవేళ నమోదు కాకపోతే ప్రజల నుంచి భారీగా విరాళాలు సేకరించడంపై విచారణ చేపట్టాలని స్పష్టం చేశారు. అలాగే అభిజిత్ దీప్కే తండ్రి భగవాన్‌రావు దీప్కే ఆర్థిక పరిమితులు, అభిజిత్ విదేశీ విద్యకు సమకూరిన నిధుల మూలాలను కూడా వెలికితీయాలని డిమాండ్ చేశారు.
జీఎస్టీ వర్తింపుపై ప్రశ్నించిన ఆర్టీఐ కార్యకర్త:
ఈ క్రమంలోనే సీజేపీ ప్రకటించిన రూ.1 కోటి న్యాయ రక్షణ నిధిపై 18 శాతం జీఎస్టీ వర్తిస్తుందా లేదా అనే విషయాన్ని తనిఖీ చేయాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ ని తివారీ కోరారు. సేకరించిన నిధుల వినియోగం, పన్ను నిబంధనలకు అనుగుణంగా ఉందో లేదో స్పష్టత రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం సీజేపీ చట్టబద్ధత, విరాళాల సేకరణ విధానం, ఆర్థిక అంశాలపై అధికారులు విచారణ చేపట్టి స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
