చనిపోయిన కూతురు కోసం : 45మంది అమ్మాయిల్ని చదివిస్తున్నాడు  

  • Publish Date - August 22, 2019 / 09:44 AM IST

పుట్టిన ప్రతీ మనిషీ మరణించక తప్పదు. కానీ కన్నవారి కళ్లముందే కడుపున పుట్టిన బిడ్డలకు చనిపోతే.. ఆ కడుపుకోత పగవారికి కూడా వద్దు భగవంతుడా అన్నంత వేదన కలిగిస్తుంది. కన్న కూతురు కళ్లముందే మట్టిలో కలిసిపోతే ఆ బాధను దిగమింగుకుని పలువురికి ఆదర్శంగా నిలిచాడు ఓ తండ్రి. తండ్రికి గుండె కోత మిగిల్చి కన్నకూతురు మృతి చెందింది. ఆ బాధనుంచి బైటపడేందుకు ఆ తండ్రి తీసుకున్న నిర్ణయం ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది. చనిపోయిన కుమార్తెను ఇతర బాలికల్లో చూసుకుంటున్నాడు. ఆ ఆదర్శ తండ్రి ఎవరు?  కుమార్తె కోసం ఏం చేశాడో తెలుసుకుందాం..

కర్ణాటకలోని కలబురగి సిటీ మక్తంపుర ప్రాంతంలో నివసిస్తుంటాడు బసవరాజ్‌.అతను మండల పరిషత్‌ హై స్కూల్‌లో క్లర్క్‌గా పనిచేస్తున్నాడు. కొంత కాలం క్రితం బసవరాజ్ కుమార్తె ధనేశ్వరిని అనారోగ్యంతో చనిపోయింది. కుమార్తె మరణంతో తల్లడిల్లిపోయాడు బసవరాజ్.  పిచ్చివాడైపోయాడు.  కన్ను మూసినా తెరిచినా నిరంతరం కళ్లముందు కదలాడుతున్న కుమార్తె జ్నాపకాలను మరచిపోలేకపోయాడు. తిండి లేదు..నిద్ర లేదు. నిరంతరం కుమార్తె జ్నాపకాలే. కానీ అలా అతను ఏమైపోతాడోనని భయపడ్డారు బంధువులు,కుటుంబ సభ్యులు. కానీ చనిపోయిన కుమార్తె బాధ నుంచి కోలుకోవాలనుకున్నాడు.దాని కోసం అతను తీసుకున్ననిర్ణయం ఆదర్శంగా నిలిచింది. 

కన్న కూతురు పోయిన బాధ నుంచి బయట పడేందుకు బసవరాజ్‌ తాను పనిచేసే స్కూల్ లో చదువుకునే పేద బాలికలను చదివించాలనుకున్నాడు. అలా 45 మంది బాలికలకు ఫీజులు కడుతున్నాడు. వారికి చదువుకు అయ్యే ఖర్చు అంతా తానే భరించేందుకు ముందుకు వచ్చాడు. అలా వారిలో తన కూతుర్ని చూసుకుంటున్నాడు. తమకు అంత సహాయం చేస్తున్న బసవరాజ్‌కు ఆ బాలికలతోపాటు వారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. 

పేదరికంలో ఉండి చదువుకునేందుకు నానా కష్టాలు పడతున్న మా అందరికీ బసవరాజ్ సార్ చేస్తున్న ఈ సహాయాన్ని తాము మరచిపోలేమనీ..తమకు అండగా నిలిచిన బసవరాజ్ సార్ కు ధన్యవాదాలను తెలిపింది ఫాతిమా అనే విద్యార్థిని. సార్ కుమార్తె ధనేశ్వరి ఆత్మ శాంతించాలని తామంతా కోరుకుంటున్నామని  తెలిపింది.