Vande Bharat Sleeper : వావ్.. వందే భారత్ స్లీపర్.. కోచ్ లు అదిరిపోయాయ్.. ఫీచర్లు ఇంకా..

ఈ రైలు ఢిల్లీ నుంచి సుమారు 1,000 కిలోమీటర్ల దూరంలోని నగరాలకు వెళ్లనుందని రైల్వే అధికారులు చెప్పారు.

Vande Bharat Sleeper : వావ్.. వందే భారత్ స్లీపర్.. కోచ్ లు అదిరిపోయాయ్.. ఫీచర్లు ఇంకా..

Vande Bharat sleeper trains

Updated On : September 8, 2025 / 7:00 PM IST

Vande Bharat sleeper train: భారత రైల్వే త్వరలోనే మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ రైలును ప్రారంభించనుంది. సుదూర ప్రయాణాల కోసం వందే భారత్‌ ప్లాట్‌ఫామ్‌పై నిర్మించిన ఈ ప్రోటోటైప్‌ రైలు (మొదటి నమూనా రైలు) రాజధాని ఎక్స్‌ప్రెస్‌తో పోల్చితే వేగంగా వెళ్లడమేగాకుండా, మరింత సౌకర్యవంతంగా ఉంటుంది.

రైలు డిజైన్‌ ఇప్పటికే పూర్తయింది. కొన్ని వారాల్లోనే ఈ రైళ్లు పట్టాలపై పరుగులు తీసే అవకాశం ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా 10 ట్రైన్‌ సెట్లను విడుదల చేయనున్నారు. చెన్నై ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో అదనంగా 50 వందే భారత్‌ స్లీపర్‌ రేక్స్‌ తయారీ జరుగుతోంది. వందే భారత్‌ స్లీపర్‌ రేక్స్‌ అంటే ఈ రైళ్లలో నిద్రించడానికి సౌకర్యం ఉన్న బోగీలతో తయారు చేసిన రైలు సెట్లు. అలాగే, ఈ టెక్నాలజీ పార్ట్‌నర్స్‌ మరో 200 వందే భారత్‌ స్లీపర్‌ రేక్స్‌ తయారు చేయడానికి కాంట్రాక్టులు పొందారు.

వందే భారత్‌ స్లీపర్‌ రైలు మార్గాలు

ఎకనామిక్ టైమ్స్‌ రిపోర్టు ప్రకారం.. తొలి వందే భారత్‌ స్లీపర్‌ సర్వీసు ఢిల్లీ నుంచి ప్రారంభం కానుంది. ఈ రైలు ఢిల్లీ నుంచి సుమారు 1,000 కిలోమీటర్ల దూరంలోని నగరాలకు వెళ్లనుందని రైల్వే అధికారులు చెప్పారు. అహ్మదాబాద్‌, భోపాల్‌, పాట్నా (వారణాసి మార్గం) వంటి మార్గాలు పరిశీలనలో ఉన్నాయి.

“ప్రధాన లక్ష్యం ఎక్కువ డిమాండ్‌ ఉన్న మార్గాలలో రైళ్ల లభ్యతను పెంచడమే” అని ఒక అధికారి తెలిపారు. దీనిపై తుది నిర్ణయం త్వరలో తీసుకోనున్నారు. (Vande Bharat sleeper train)

వందే భారత్‌ స్లీపర్‌ రైళ్ల వేగం

వందే భారత్‌ ప్లాట్‌ఫామ్‌పై నిర్మించిన స్లీపర్‌ రైళ్ల గరిష్ఠ వేగం 180 కి.మీ/గం, ఆపరేషన్‌ వేగం 160 కి.మీ/గం. ప్రోటోటైప్‌ వందే భారత్‌ స్లీపర్‌ రైలులో 16 కోచ్‌లు ఉన్నాయి. వీటిలో 11 ఏసీ 3 టియర్‌ కోచ్‌లు, 4 ఏసీ 2 టియర్‌ కోచ్‌లు, ఒక ఏసీ ఫస్ట్‌ క్లాస్‌ కోచ్‌ ఉన్నాయి. ప్రత్యేక నైట్‌ ఇల్యూమినేషన్‌, ఇంటిగ్రేటెడ్‌ అనౌన్స్‌మెంట్‌లు, విజువల్‌ డిస్ప్లేలు, సీసీటీవీలు, మాడ్యులర్‌ పాంట్రీ యూనిట్లు ఉంటాయి.

యూరోపియన్‌ రైలు వ్యవస్థల మాదిరిగా రూపొందించిన ఈ స్వీపర్ రైళ్లు మృదువుగా ఉండే బెర్త్‌లతో మెరుగైన సౌకర్యాన్ని కలిగిస్తాయి. ప్రయాణికులు అప్పర్‌ బెర్త్‌కి సులభంగా ఎక్కడానికి పలు మార్పులు చేశారు.

ఎన్నో ప్రత్యేకతలు

విమానాల్లో ఉండే బయో-వాక్యూమ్‌ టాయిలెట్లు ఈ రైల్లో ఉన్నాయి. దివ్యాంగులకు అనుకూల సౌకర్యాలు, శిశు సంరక్షణ స్టేషన్లు ఉన్నాయి. ఏసీ ఫస్ట్‌ క్లాస్‌లో వేడి నీటితో షవర్‌ సదుపాయం ఉంది.

ఈ రైళ్లను స్థానికంగా అభివృద్ధి చేసిన కవచ్‌ యాంటీ-కొలిజన్‌ సిస్టమ్‌ (రైళ్లు ఢీకొట్టకుండా నిరోధించే వ్యవస్థ)తో అమర్చారు. రిజనరేటివ్‌ బ్రేకింగ్‌ టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు. కోచ్‌లలో ఆటోమేటిక్‌ ఇంటర్‌కనెక్టింగ్‌ డోర్లు ఉన్నాయి.

ప్రతి కోచ్‌లో చార్జింగ్‌ పాయింట్లు, రిఫ్రెష్‌మెంట్‌ టేబుళ్లు, జిఎఫ్‌ఆర్‌పి ప్యానెల్‌ ఇంటీరియర్స్‌ ఉన్నాయి. తలుపులు నిర్ణీత స్టాప్‌లలో ఆటోమేటిక్‌గా పనిచేస్తాయి.

రైలులో సెంట్రలైజ్డ్‌ కోచ్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ (సౌకర్యాల పర్యవేక్షణ వ్యవస్థ) ఉంటుంది. అత్యవసర కమ్యూనికేషన్‌ సిస్టమ్‌ డ్రైవర్‌తో అనుసంధానం చేస్తుంది. ప్రతి కోచ్‌లో సీసీటీవీ కెమెరాలు ఉంటాయి.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 150 చైర్‌ కార్‌ వందే భారత్‌ రైళ్లు నడుస్తున్నాయి. ఇవి పగటి పూట మాత్రమే నడుస్తాయి. రాబోయే స్లీపర్‌ రైళ్లు రాత్రి కూడా నడుస్తాయి.

వందే భారత్‌ రైళ్ల ఆక్యుపెన్సీ రేటు 2024-25లో 102.01% మేర చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 105.03%గా నమోదైంది.