Supreme Court On Aadhaar: ఆధార్‌ను గుర్తింపు పత్రంగా అంగీకరించాలి.. ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..

ఓటర్ జాబితాలో చేరికలకు అవసరమైన గుర్తింపు పత్రాలకు సంబంధించి సుప్రీంకోర్టు.. కేంద్ర ఎన్నికల సంఘానికి ఇచ్చిన కీలక ఆదేశాలు ఏంటి..

Supreme Court On Aadhaar: ఆధార్‌ను గుర్తింపు పత్రంగా అంగీకరించాలి.. ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..

Updated On : September 8, 2025 / 6:03 PM IST

Supreme Court On Aadhaar: బీహార్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) విషయంలో భారత ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఓటరు గుర్తింపు ధ్రువీకరణకు ఆధార్‌ను ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీగా పరిగణించాలని ఈసీకి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆధార్ ను 12వ డాక్యుమెంట్‌గా పరిగణించాలంది.

బీహార్ సవరించిన ఓటర్ల జాబితాలో చేర్చేందుకు ఆధార్ ను గుర్తింపు రుజువుగా సమర్పించవచ్చంది. అదే సమయంలో ఆధార్ కార్డ్ ప్రామాణికతను సరి చూసుకోవాలని ఎన్నికల కమిషన్ కు సూచించింది. బీహార్ సమగ్ర ఓటరు సర్వేపై మరోసారి విచారణ జరిపిన జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ ధర్మాసనం.. ఈ ఆదేశాలు ఇచ్చింది.

అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలకు అర్థం ఏంటంటే.. ఓటర్ల జాబితాలో చేర్చడానికి ఆధార్ కార్డును ఒక స్వతంత్ర పత్రంగా సమర్పించవచ్చు. ఓటర్ల జాబితాలో చేర్చేందుకు ఈసీఐ 11 పత్రాలను ఆమోదించిన విషయం తెలిసిందే. వాటిలానే.. ఆధార్ ను కూడా ఇకపై ఒక డాక్యుమెంట్ గా సబ్మిట్
చేయొచ్చు.

ఆధార్.. పౌరసత్వానికి రుజువు కాదు..

కాగా.. ఆధార్.. పౌరసత్వానికి రుజువు కాదని కోర్టు తన ఉత్తర్వులో స్పష్టం చేసింది. ఆధార్ అంగీకారానికి సంబంధించి తన అధికారులకు సూచనలు జారీ చేయాలని భారత ఎన్నికల సంఘాన్ని కోర్టు ఆదేశించింది. అదే సమయంలో ఓటర్లు సమర్పించిన ఆధార్ కార్డుల ప్రామాణికత, వాస్తవికతను ధృవీకరించే హక్కు ECI అధికారులకు ఉంటుందని న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఇక ఆధార్ చట్టం ప్రకారం, ఆధార్ కార్డు పౌరసత్వానికి రుజువు కాదని కోర్టు పేర్కొంది.

ఎన్నికల జాబితాలో చేర్చడానికి ఆధార్ కార్డును స్వతంత్ర పత్రంగా ECI అధికారులు అంగీకరించడం లేదని, SIR నోటిఫికేషన్‌లో ECI పేర్కొన్న 11 పత్రాలలో ఏదో ఒకదాన్ని సమర్పించాలని పట్టుబడుతున్నారని RJD, ఇతర పిటిషనర్లు కోర్టును ఆశ్రయించారు. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం దీనిపై విచారణ జరిపి తాజా ఆదేశాలు ఇచ్చింది.

ఆధార్ కార్డును ఎన్నికల అధికారులు గుర్తించడం లేదు..

ఆధార్ కార్డును కూడా పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు మూడు ఆదేశాలు జారీ చేసినప్పటికీ, ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు, బూత్ లెవల్ అధికారులు దాన్ని అంగీకరించడం లేదని ఆర్జేడీ తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ కోర్టులో వాదనలు వినిపించారు. ఆధార్ కార్డును ఆమోదించినందుకు బీఎల్ఓకు జారీ చేసినట్లుగా చెప్పబడుతున్న షో-కాజ్ నోటీసును ఆయన ఉదహరించారు.

ఆధార్ కార్డును ఆమోదించాలని ఈసీఐ తన అధికారులకు ఎటువంటి సూచనలు జారీ చేయలేదని, అందువల్ల సుప్రీంకోర్టు ఆదేశాలు అమలు కావడం లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు సిబల్. ఆధార్ కార్డులు ఆమోదించబడని అనేక మంది ఓటర్ల అఫిడవిట్లు కూడా దాఖలు చేశామన్నారు.

బీహార్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే సరైన వివరాలు, గణాంకాలతో సిద్ధంగా ఉండాలని ఎన్నికల సంఘానికి జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జోయ్‌మాల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం సూచనలు చేసిన విషయం విదితమే.

బీహార్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ మంటలు రాజేస్తోంది. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ చేపట్టక ముందు రాష్ట్రంలో మొత్తం నమోదిత ఓటర్ల సంఖ్య 7.9 కోట్లు. ముసాయిదాలో అది 7.24 కోట్లకు తగ్గింది. ఈ వ్యవహారంపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి.

Also Read: ట్రంప్ యూటర్న్.. దెబ్బకి దిగొస్తున్నాడా?.. టారిఫ్ లతో వసూలు చేసిన డబ్బుల్లో సగం వాపస్?