Cm Revanth Reddy: కూకట్ పల్లిలో ‘ఇందిరమ్మ ఇండ్ల టవర్స్’కు శంకుస్థాపన.. తెలంగాణ అభివృద్ధి బాధ్యత మాదే: సీఎం రేవంత్ రెడ్డి
కూకట్‌పల్లిలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "ఇందిరమ్మ ఇండ్లు" టవర్స్ శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Cm Revanth Reddy)గారు పాల్గొని ప్రసంగించారు
- V Santhosh Kumar
- Published on- August 13, 2026 / 07:51 PM IST
Cm revanth reddy lays foundation for indiramma housing towers in kukatpally
- ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ శంకుస్థాపన
- పేదల ఇళ్ల కల నెరవేరుస్తాం
- కరువు కోసం క్షుద్ర పూజలు
Cm Revanth Reddy: కూకట్‌పల్లి నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ఇందిరమ్మ ఇండ్లు” టవర్స్ శంకుస్థాపన కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Cm Revanth Reddy) గారు పాల్గొని ప్రసంగించారు. గతంలో ఎంపీగా పోటీ చేసిన సమయంలో కూకట్‌పల్లి ప్రజలు నన్ను ఆశీర్వదించి గల్లీ నుంచి ఢిల్లీకి పంపారని ఈ సందర్భంగా సీఎం గుర్తు చేసుకున్నారు. అప్పట్లో ప్రతిపక్షంలో ఉండటం, గత ప్రభుత్వం సరిగా నిధులు మంజూరు చేయకపోవడంతో ఆశించిన స్థాయిలో అభివృద్ధి చేయలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు కూకట్‌పల్లిని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు తమ వద్ద పూర్తి అధికారం ఉందని, ఈ ప్రాంతానికి ఏ విధమైన అభివృద్ధి కావాలన్నా అడిగి మరీ చేయించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అంతేకాకుండా కూకట్‌పల్లి నియోజకవర్గాన్ని ప్రత్యేక దృష్టితో అభివృద్ధి చేయాలని మంత్రి శ్రీధర్ బాబు గారిని సీఎం ఆదేశించారు.
గత పదేళ్ల పాలన – రెండేళ్ల మా పాలనపై బేరీజు వేసుకోండి:
గత ప్రభుత్వ పదేళ్ల పాలనకు, తమ రెండేళ్ల పాలనకు తేడాను గమనించి బేరీజు వేసుకోవాలని సీఎం సూచించారు. రాష్ట్రంలోని 3 కోట్ల 28 లక్షల మందికి సన్నబియ్యం, ప్రతి పేద కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500 కే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామని తెలిపారు. మహిళల ఆత్మగౌరవాన్ని పెంచేలా ఇందిరమ్మ చీరలను సారెగా ఇవ్వడమే కాకుండా, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించామన్నారు. స్వయం సహాయక సంఘాలకు రూ.65 వేల కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు అందించామని, కొందరు కడుపులో విషం పెట్టుకుని ఆటో డ్రైవర్లను ప్రభుత్వంపైకి ఉసిగొల్పినా వెనక్కి తగ్గకుండా మహిళలకు బస్సులనే యజమానులుగా చేశామని స్పష్టం చేశారు. స్వయం సహాయక సంఘాలు పెట్రోల్ బంకులు, సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించడంతో పాటు వారి ఉత్పత్తుల విక్రయానికి శిల్పారామంలో స్టాళ్లను కేటాయించామన్నారు.
పట్టణ పేదల కోసం ఇందిరమ్మ టవర్స్: ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని నమ్మొద్దు:
గతంలో డబ్బా ఇండ్లు వద్దంటూ డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని చెప్పిన వాళ్లు ఒక్కరికైనా ఇల్లు ఇచ్చారా అని సీఎం రేవంత్ ప్రశ్నించారు. నగరాల్లోని పేదల సొంతింటి కలను నెరవేర్చడానికే తమ ప్రభుత్వం మొదటి విడతలో లక్ష ఇళ్లను అందించేలా ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టిందని తెలిపారు. 22ఏ భూముల విషయంలో ప్రజలెవరూ సొంత స్థలాలు కోల్పోకుండా చూసే బాధ్యత తమదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో కొందరు చేసే అబద్ధపు ప్రచారాన్ని నమ్మవద్దని, కొంతమంది దుర్మార్గులు రాష్ట్రంలో కరువు రావాలని క్షుద్ర పూజలు చేసినా.. దేవుడి ఆశీర్వాదం మన వైపే ఉండి సమృద్ధిగా వర్షాలు కురిపించాడని వ్యాఖ్యానించారు. కుటిల బుద్ధితో వినాశనం కోరేవారికి ఆ క్షుద్ర పూజలే తిరిగి అష్ట దిగ్బంధనంగా మారతాయని తీవ్రంగా వ్యాఖ్యానిస్తూ, ప్రజల అండదండలతో తెలంగాణను విధ్వంసం నుంచి వికాసం వైపు తీసుకెళ్తానని సీఎం ధీమా వ్యక్తం చేశారు.
