CM Vijay : సీఎంగా ప్రమాణం చేసిన వెంటనే ప్రజలకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన విజయ్.. తొలి సంతకంతోనే సంచలనం.. ఫ్యాన్స్ సంబరాలు
CM Vijay : తమిళనాడు ముఖ్యమంత్రిగా టీవీకే అధినేత విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం మూడు హామీలపై ఆయన సంతకం చేశారు. తొలి సంతకం గృహాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పై చేశారు.
- Harish Thanniru
- Updated on- May 10, 2026 / 11:56 AM IST
CM Vijay First Sign After Become CM
CM Vijay : తమిళనాడు ముఖ్యమంత్రిగా టీవీకే అధినేత విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. చెన్నైలోని జవహర్ లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో భారీ సంఖ్యలో తరలివచ్చిన ప్రజల హర్షధ్వానాల మధ్య విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ ఆర్లేకర్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతోపాటు రాజకీయ, సినీ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు.
విజయ్‌తోపాటు తొమ్మిది మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో ఎన్.ఆనంద్, ఆదవ అర్జున, కె.ఎ.సెంగోటియన్, ఎస్. కీర్తన, కె.జి. అరుణ్ రాజ్, పి. వెంకటరమణన్, సి.ఆర్. నిర్మల్ కుమార్, రాజ్ మోహన్, టి.కె. ప్రభులు ఉన్నారు. అయితే, విజయ్ ప్రమాణ స్వీకారం అనంతరం మూడు హామీలపై సంతకాలు చేశారు. తొలి సంతకం ఉచిత విద్యుత్ పథకంపై చేశారు. దీంతో 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ లభిస్తుంది. రెండో సంతకం మహిళ భద్రతపై పెట్టారు. మూడో సంతకం యాంటీ డ్రగ్ టాస్క్‌ఫోర్స్ ఫైలుపై పెట్టారు.
ప్రమాణ స్వీకారం అనంతరం విజయ్ మాట్లాడారు. డైరెక్టర్ కుమారుడు నేడు సీఎం అయ్యాడు. నేను మీ అందరివాడిని, ఎన్నో కష్టాలు అధిగమించి ఈ స్థాయికి వచ్చా.. నన్ను ఎంతోమంది ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టారంటూ భావోద్వేగ పూరిత ప్రసంగం చేశారు. తమిళనాడులో ఇప్పుడు ప్రజా ప్రభుత్వం వచ్చింది. లౌకిక, సామాజిక, న్యాయశకం మొదలైంది. మిత్రులైనా, శత్రువులైనా.. అందరికీ తమ ప్రభుత్వంలో ఒకే చట్టం వర్తిస్తుంది. బంధుప్రీతికి తావులేదు. టీవీకేలో ఒకేఒక అధికార కేంద్రం ఉందని, అదే విజయ్ అని వెల్లడించారు.
గత డీఎంకే ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసి వెళ్లింది. తాము ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తాం. కానీ, హామీల అమలుకు కొంత సమయం ఇవ్వండి అంటూ ప్రజలకు విజయ్ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఏర్పాటుకు మద్దతిచ్చిన ప్రతిఒక్కరికీ విజయ్ కృతజ్ఞతలు తెలిపారు.
