Bihar News: బీహార్‌లోని ఒక కాలేజీ విధించిన చాలా విచిత్రమైన రూల్స్ తాజాగా వెలుగులోకి వచ్చాయి. అవేంటంటే.. విద్యార్థులు కలిసి నవ్వినా, కలిసి కూర్చున్నా వారి అడ్మిషన్ రద్దు చేస్తామని కాలేజీ యాజమాన్యం రూల్స్ పెట్టింది. సివాన్ జిల్లాలోని జెడ్ఏ ఇస్లామియా పీజీ కళాశాల నిర్వాకం ఇది. దీనికి సంబంధించిన లేఖను మంగళవారం విడుదల చేశారు. ఇది కాస్త బయటికి రావడంతో స్థానికంగా దుమారం లేపింది.
సివాన్‌లోని జెడ్ఏ ఇస్లామియా కళాశాల ప్రిన్సిపాల్ ఇద్రిస్ ఆలం జారీ చేసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ లేఖలో “కళాశాల క్యాంపస్‌లో మగ, ఆడ విద్యార్థులు ఒకచోట కనిపిస్తే (కలిసి కూర్చొని/జోక్ చేస్తూ) వారి అడ్మిషన్ రద్దు చేస్తామని తెలియజేస్తున్నాము. సెక్షన్ 29, 30 ప్రకారం ఇది మైనారిటీ కళాశాల అని గమనించాలి. భారత ప్రభుత్వం క్రింద స్థాపించబడింది. కాలేజీకి అన్ని నిర్వహణ బాధ్యతలు, అధికారం పాలకమండలికి ఉంది” అని పేర్కొన్నారు.
ఆ లేఖ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది?
కొద్ది రోజుల క్రితం ఇద్దరు కాలేజీ విద్యార్థుల మధ్య గొడవ జరిగింది. క్లాస్‌రూమ్‌లోనూ, రోడ్డుపైనా జరిగిన గొడవకు సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. బహుశా దీనికి సంబంధించి కాలేజీ ప్రిన్సిపాల్ అలాంటి ఉత్తర్వు జారీ చేసి ఉండవచ్చని అంటున్నారు.
ప్రిన్సిపాల్ జారీ చేసిన లేఖపై క్లారిటీ ఇచ్చారు
జెడ్ఏ ఇస్లామియా పీజీ కళాశాల ప్రిన్సిపాల్ ఇద్రిస్ ఆలం ఫోన్ ద్వారా మాట్లాడుతూ.. ‘‘ఇది పెద్ద విషయం కాదు. కొన్ని రోజుల క్రితం అమ్మాయిల మధ్య గొడవ జరిగింది. బాయ్‌ఫ్రెండ్-గర్ల్‌ఫ్రెండ్ ఎఫైర్ జరిగింది. పిల్లలను భయపెట్టడానికి మేము అలాంటి లేఖను జారీ చేసాము. అయితే ఈ లేఖ తప్పు. ఇలా రాసి ఉండకూడదు’’ అని అన్నారు. ఇక ఈ విషయపై శివన్ డీఎం ముకుల్ కుమార్ గుప్తా మాట్లాడుతూ, తన దృష్టికి ఇంకా ఈ విషయం రాలేదని అన్నారు.