రాహుల్ బంపర్ ఆఫర్ : పేదల ఖాతాలోకే డబ్బులు  

  • Publish Date - January 28, 2019 / 01:55 PM IST

ఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సంచలన హామీ ఇచ్చారు. పేదలపై వరాల జల్లు కురిపించారు. గెలుపే టార్గెట్‌గా ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతున్నారు. ప్రియాంక గాంధీని ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకొచ్చిన ఆయన.. పేదలను ఆకర్షించేందుకు సంచలన ప్రకటన చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో గెలిస్తే పేదలకు నిర్దిష్ట ఆదాయం అమలు చేస్తామని.. నేరుగా పేదల బ్యాంక్ ఖాతాలలోకే డబ్బులు వేస్తామని ప్రకటించారు. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ కిసాన్ అభార్ సమ్మేళనంలో రాహుల్ పాల్గొన్నారు.

పేదలు ఆకలితో అలమటిస్తుంటే నవ భారతాన్ని ఎలా నిర్మిస్తామని.. పేదలు కడుపు నిండా అన్నం తిని వారు అభివృద్ధి చెందినప్పుడు నవభారత నిర్మాణానికి అర్థముంటుదని రాహుల్ అన్నారు. అధికారంలోకి వస్తే.. దేశంలోని పేదలందరికీ కనీస ఆదాయాన్ని అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన గ్రామీణ ఉపాధి హామీ పథకానికి ఇది కొనసాగింపుగా భావించొచ్చు. 100 రోజుల పని పథకం.. యూపీఏ తిరిగి అధికారంలోకి రావడానికి దోహదం చేసిన సంగతి తెలిసిందే.

 

కాంగ్రెస్ గతంలో అనేక చారిత్రక నిర్ణయాలను తీసుకుందన్న రాహుల్.. 2019లో అధికారంలోకి వస్తే.. మరో చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంటామన్నారు. రాహుల్ చెబుతున్న పథకం అమల్లోకి వస్తే.. దేశంలో పేదలందరూ కనీస ఆదాయం పొందనున్నారు. ఆకలి, పేదరికం లేని నవభారత నిర్మాణమే తమ లక్ష్యమని రాహుల్ ప్రకటించారు. 

 

ఒక పక్క ప్రధాని నరేంద్రమోదీ దేశ ప్రజలపై పథకాల జల్లు కురిపిస్తుంటే ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా మోడీకి ధీటుగా కీలక హామీలిస్తున్నారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ పేదలకు ప్రకటించిన ఈ వరాలు కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొస్తాయో లేదో వేచి చూడాలి.