మహమ్మారిపై యుద్ధం చేయడానికి ‘ఆరోగ్యసేతు యాప్’

కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకీ పెరుగుతుండటం ప్రజలందరిలో కలవరపెడుతున్న అంశం. ఒకరి నుంచి మరొకరికి పలు మార్గాల్లో సంక్రమిస్తున్న వైరస్ బారిన పడి.. శుక్రవారం ఉదయం నాటికి 2 వేలకు పైగా బాధితుల సంఖ్య నమోదుకాగా.. అందులో 72 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో పెరుగుతున్న కరోనా కేసులపై ఓ లెక్క ఉండాలని.. దానిని బట్టే నియంత్రణ చర్యలు తీసుకోవడానికి వీలవుతుందని కేంద్ర ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేసింది. 

కరోనా దరి చేరకుండా అడ్డుకునేందుకు శుక్రవారం ఓ యాప్‌ను లాంచ్ చేసింది. ఎలక్ట్రానిక్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖ పరిధిలో ‘ఆరోగ్య సేతు’ యాప్‌ను ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కరోనా బారిన పడకుండా ఉండేందుకు సహకరించడంతో పాటు కోవిడ్‌-19 బారిన మనం పడకుండా అటువంటి వారు మనల్ని సమీపిస్తే మనల్ని హెచ్చరిస్తుంది. 

ఎక్కడ డౌన్‌లోడ్‌ చేసుకోవాలి:
ముందుగా ఈ యాప్‌ను ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో గూగుల్ ప్లే స్టోర్‌లో, ఐ ఫోన్‌ల కోసం యాప్ స్టోర్‌లో నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ఆ తర్వాత పేరు, మొబైల్‌ నంబర్‌తో రిజిష్టర్‌ చేసుకోవాలి. వీటితోపాటు మన ఆరోగ్య విషయాలను.. ఇతర వివరాలను నమోదు చేయాలి. ట్రాకింగ్‌ను ప్రారంభించడం కోసం ఫోన్‌లో జీపీఎస్‌, బ్లూ టూత్‌ సిస్టమ్‌ను ఆన్‌లో ఉంచాలి. ప్రస్తుతం ఆరోగ్య సేతు యాప్‌ 11 భాషల్లో అందుబాటులో ఉంది. 

ఇందులో మీ సమాచారమంతా ర‌హ‌స్యంగా ఉంటుంది. ప్ర‌భుత్వానికి త‌ప్ప ఎవ‌రికి తెలిసే అవ‌కాశం ఉండదు. అత్యాధునిక టెక్నాలజీ, ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ ద్వారా ఈ యాప్‌ పనిచేస్తుంది.  

యాప్ బెనిఫిట్స్ ఇవే:
 కోవిడ్ -19 లక్షణాలు ఏమైనా ఉన్నాయా అని నిర్థారించ‌డానికి అనేక ప్రశ్నలను అడిగే ప్రత్యేకమైన చాట్‌బోట్ ఉంటుంది.
కరోనా బారిన పడకుండా ఉండేందుకు సహాయపడుతుంది
కరోనావైరస్ ఉన్న వ్య‌క్తికి దగ్గరగా వెళ్తే యాప్ మీ లొకేష‌న్ స్కాన్ చేసి.. మీ డేటాను ప్ర‌భుత్వానికి చేర‌వేస్తుంది.
 దేశంలో కరోనా కేసుల అప్‌డేట్‌ తెలుసుకోవచ్చు.
కేంద్ర‌, రాష్ట్ర‌ ఆరోగ్య మంత్రిత్వ శాఖ చేసే ప్ర‌క‌ట‌న‌లు, తీసుకునే చ‌ర్య‌లను తెలియజేస్తుంది.