భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు 31కి చేరిన నేపథ్యంలో అందరూ అలర్ట్ అయ్యారు. ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రా నగరంలో పర్యటించిన ఓ విదేశీయుడికి కరోనా వైరస్ సోకిన నేపథ్యంలో మధుర ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్స్‌స్‌నెస్ (ISKcon) సంచలన నిర్ణయం తీసుకుంది. ఉత్తరప్రదేశ్ లోని మధుర-బృందావనం దేవాలయంలోకి విదేశీయుల ప్రవేశంపై నిషేధం విధిస్తున్నట్లు ఇస్కాన్ నిర్వహణ కమిటీ ప్రకటించింది.
మధుర-బృందావనం దేవాలయానికి ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన భక్తులున్నారు. ఈ నెల 9వతేదీన దేవాలయంలో జరగనున్న గౌరపూర్ణిమ ఉత్సవంలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున విదేశీ భక్తులు తరలివస్తారు. కరోనా వైరస్ నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా విదేశీ భక్తులను ఆలయంలోకి అనుమతించేది లేదని మధుర ఇస్కాన్ అధికార ప్రతినిధి రాజీవ్ లోచన్ తెలిపారు.(ఢిల్లీలో మరొకరికి కరోనా : 31కి చేరిన కేసులు)
మార్చి 7న జరగవలసిన హోలీ వేడుకలను కూడా రద్దు చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నందువల్ల రెండు నెలలపాటు విదేశీ భక్తులు దేవాలయాన్ని సందర్శించవద్దని కోరామని మధుర ఇస్కాన్ కమ్యూనికేషన్స్ డైరెక్టరు సౌరబ్ దాస్ తెలిపారు. బృందావనంలో ప్రతిఏటా హోలీ వేడుకలు నిర్వహించే సులభ్ ఫౌండేషన్ కరోనా వల్ల వేడుకలను రద్దు చేసినట్లు ప్రకటించింది.
మరోవైపు దేవాలయానికి వచ్చే దేశీయ భక్తులందరూ వారి భద్రత రీత్యా మాస్క్ లు ధరించాలని కోరుతూ దేవాలయం గేటు వద్ద నోటీసు బోర్డులు ఏర్పాటు చేశారు. ఇటీవల భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ కూడా కరోనా వైరస్ నేపథ్యంలో ఈ ఏడాది హోలి వేడుకలకు అందరూ దూరంగా ఉండాలని విజ్ణప్తి చేసిన విషయం తెలిసిందే.