దేశంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతుంటే ప్రతి ఒక్కరిలో అనుమానంతో కూడిన భయం మొదలైపోయింది. దీంతో ప్రభుత్వం కరోనా టెస్టులు చేసేందుకుగానూ రాష్ట్రాలకూ ప్రత్యేక అనుమతులిచ్చేసింది. డిమాండ్‌ను బట్టి కరోనా టెస్టుకు భారీ మొత్తంలో ఫీజులు వసూలు చేయకుండా కండిషన్ పెట్టింది.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రైవేట్ ల్యాబొరేటరీలకు కొత్త సూచనలు చేసింది. ఈ పరీక్షలకు గరిష్ఠంగా రూ.4వేల 500మాత్రమే తీసుకోవాలి. అందులోనే స్క్రీనింగ్ టెస్టుకు రూ.1500, కన్ఫర్మేషన్ టెస్టుకు రూ.3వేలు కలిపి తీసుకోవాలని తెలిపింది. ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా దేశంలో 5మంది చనిపోగా, 315పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఇప్పటివరకూ గవర్నమెంట్ ల్యాబొరేటరీలు మాత్రమే కరోనా టెస్టులు నిర్వహించేవి. అది కూడా ఉచితంగా. లక్షణాలున్న వ్యక్తులు పెరుగుతుండటంతో ప్రైవేట్ ల్యాబ్ లకు ఆ అనుమతులు ఇచ్చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన ఫీజుల కంటే ఎక్కువ తీసుకుంటే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
‘శాంపుల్ టెస్టులకు అయ్యే ఖర్చులను నేషనల్ టాస్క్ ఫోర్స్ ఫిక్స్ చేసింది. గరిష్ఠంగా రూ.4వేల 500దాటకూడదని, స్క్రీనింగ్ టెస్టుకు రూ.1500, పాజిటివ్ కన్ఫార్మేషన్‌కు రూ.3000ఫీజును నిర్ణయించారు. ముందుగా ఉచితంగా చేయాలని నిర్దేశించడంతో ప్రైవేట్ ఆర్గనైజేషన్లు నిరాకరించాయి. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఫీజులు వసూలు చేసేందుకు అనుమతులిచ్చినట్లు అధికారులు వెల్లడించారు.