Court frames charges against Ashish Misra in Lakhimpur Kheri case
Lakhimpur Kheri Case: ఉత్తర ప్రదేశ్లోని లఖింపూర్ ఖేరిలో రైతులపైకి జీప్ ఎక్కించి వారి మరణానికి కారణమైన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు మరింత ఉచ్చు బిగుస్తోంది. తాజాగా ఆయనపై కోర్టు మరిన్ని అభియోగాలు మోపింది. ఆశిష్ మిశ్రాతో సహా మొత్తం 13 మంది ప్రతివాదులు హత్య, హత్యాయత్నం సహా సంబంధిత సెక్షన్ల కింద నిందితులుగా ఉన్నారు. తాజాగా వీరిపై విచారణ ప్రారంభం కానుందని అదనపు జిల్లా న్యాయమూర్తి సుశీల్ శ్రీవాస్తవ తెలిపారు. ఈ కేసులో ఆశిష్ మిశ్రా ప్రధాన నిందితుడు.
ఇక తాజాగా ఆశిష్ మిశ్రా సహా 13 మంది నిందితులపై భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ)లోని 302, 307, 326, 147 సెక్షన్ల కింద అభియోగాలు మోపారు. ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య పర్యటనకు వ్యతిరేకంగా లఖింపూర్ ఖేరీలో రైతులు ఆందోళన చేస్తున్న రైతులపైకి ఆశిష్ మిశ్రా జీప్ దూసుకెళ్లడంతో టికునియాలో ఎనిమిది మంది మరణించారు. ఈ ఘటన అక్టోబరు 3, 2021న జరిగింది. ఈ ఘటన అనంతరం లఖింపూర్ ఖేరిలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.
ఇక ఈ కేసును తప్పుదారి పట్టించేందుకు, ఆశిష్ మిశ్రాను తప్పించేందుకు అనేక ప్రయత్నాలు జరిగాయి. రైతులపైకి ఎక్కిన వాహనంలో ఆశిష్ మిశ్రా లేడని తప్పుడు సాక్ష్యాలు చూపించే ప్రయత్నం చేసినప్పటికీ, అవేవీ ఫలించలేదు. మొదట ఆయనకు బెయిల్ మంజూరు చేసినప్పటికీ, తీవ్ర వ్యతిరేకత మధ్య ఉపసంహరించుకున్నారు.