జమ్మూకాశ్మీర్ పుల్వామాలో గురువారం(ఫిబ్రవరి-14-2019) సాయంత్రం CRPF జవాన్లపై జరిగిన ఉగ్రదాడిని కేంద్రం తీవ్రంగా ఖండించింది. ఎన్ఐఏతో అత్యవసరంగా సమావేశమైన
జమ్మూకాశ్మీర్ పుల్వామాలో గురువారం(ఫిబ్రవరి-14-2019) సాయంత్రం CRPF జవాన్లపై జరిగిన ఉగ్రదాడిని ప్రధాని మోడీ తీవ్రంగా ఖండించారు. NIAతో అత్యవసరంగా సమావేశమైన ప్రధానమంత్రి పరిస్థితిని సమీక్షించారు. టెర్రర్ అటాక్‌పై మోడీ తీవ్రంగా స్పందించారు. జవాన్ల త్యాగం వృధా పోదన్నారు. మృతుల కుటుంబాలకు ప్రధాని సంతాపం తెలిపారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని.. CRPF జవాన్లపై జరిగిన దాడిని తుచ్ఛమైన చర్యగా అభివర్ణించారు. ఈ పిరికిపంద చర్యను ఖండిస్తున్నామని అన్నారు. మృతవీరుల కుటుంబాలకు యావత్ భారతదేశం అండగా నిలుస్తుందని మోడీ భరోసా ఇచ్చారు. అదే సమయంలో మోడీ మరో సర్జికల్ స్ట్రైక్స్‌కి సిద్ధమయ్యారనే వార్తలు వస్తున్నాయి. ఉగ్రవాదులకు బుద్ధి చెప్పాలంటే మరోసారి మెరుపుదాడులు చేయాల్సిందే అనే అభిప్రాయం దేశవ్యాప్తంగా వ్యక్తమవుతోంది.
ఉగ్రవాదులకు మరిచిపోలేని గుణపాఠం చెబుతాం:
CRPF జవాన్లపై దాడి ఘటనను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఖండించారు. అమరవీరుల కుటంబాలకు కేంద్రం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ ఘటనలో గాయపడ్డ జవాన్లు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఉగ్రవాదులకు మరిచిపోలేని గుణపాఠం చెబుతామని ఆయన వార్నింగ్ ఇచ్చారు.
శ్రీనగర్‌కు రాజ్‌నాథ్ సింగ్:
ఉగ్రదాడిపై కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆరా తీశారు. జమ్ము కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్‌తో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కేంద్ర హోం శాఖ కార్యదర్శి, సీఆర్పీఎఫ్ డీజీతోనూ రాజ్ నాథ్ ఫోన్‌లో మాట్లాడారు. రాజ్ నాథ్ శుక్రవారం(ఫిబ్రవరి 15వ తేదీ, 2019) శ్రీనగర్‌కు వెళ్లనున్నారు. శుక్రవారం తన కార్యక్రమాలన్నింటినీ ఆయన రద్దు చేసుకున్నారు. జమ్ముకశ్మీర్‌లో పరిస్థితులను సీనియర్ సీఆర్పీఎఫ్ అధికారులతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సమీక్షిస్తున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ టెర్రరిస్టుల దాడిని పిరికి చర్యగా వర్ణించారు. కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ముఫ్తీ మెహబూబా కూడా ఉగ్రవాదుల చర్యను ఖండించారు. చర్చల ద్వారానే సమస్య పరిష్కారం చేయాలని మెహబూబా సూచించారు.
CRPF 54వ బెటాలియన్‌కి చెందిన జవాన్లు జమ్ము-శ్రీనగర్ హైవే మార్గంలో బస్సులో ప్రయాణిస్తుండగా పుల్వామా జిల్లా అవంతిపొరా గోరిపారా దగ్గర జైషే మహమ్మద్ ఉగ్రవాదులు దాడి చేశారు. బస్సులో జవాన్లు వెళ్తుండగా ఓ ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. స్కార్పియోలో 350 కిలోల పేలుడు పదార్దాలతో వచ్చి CRPF జవాన్ల వాహనాన్ని ఢీకొట్టాడు. పేలుడు ధాటికి జవాన్ల బస్సు తునాతునకలైంది. బస్సులో ఉన్న 42మంది జవాన్లు చనిపోయారు. ఆత్మాహుతికి పాల్పడిన ఉగ్రవాదిని అదిల్ అహ్మద్ దార్ అలియాస్ వకాస్‌గా గుర్తించారు. కశ్మీర్‌కు చెందిన అదిల్ ఏడాదిగా జైష్ ఏ మహమ్మద్ ఉగ్రవాద సంస్థలో శిక్షణ పొందాడు. ఈ ఉగ్రదాడితో యావత్ దేశం షాక్‌కు గురైంది. దేశంలో ఇంత పెద్ద ఎత్తున ఉగ్రదాడి జరగడం ఇదే ప్రథమం అని రక్షణశాఖ అధికారులు చెబుతున్నారు.