పశ్చిమ బెంగాల్ ను తాకనున్న ఫొని తుఫాన్ : హై అలర్ట్

  • Publish Date - May 4, 2019 / 02:11 AM IST

20 ఏళ్లలో ఎన్నడూ లేనంత తీవ్రస్థాయిలో తీవ్ర పెనుతుపానుగా తీరంపై విరుచుకుపడిన ఫొని ధాటికి ఒడిశా విలవిల్లాడుతుండగా.. పక్కనే ఉన్న పశ్చిమ బెంగాల్ బిక్కుబిక్కుమంటోంది. బాలాసోర్ వద్ద ఫోని కేంద్రీకృతమై ఉండగా… ఈశాన్యదిశగా పయనించి ఇవాళ ఉదయం పశ్చిమ బెంగాల్‌ను తాకుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. తుఫాను ముంచుకొస్తున్న వేళ.. బెంగాల్ ప్రభుత్వం అప్రమత్తమైంది. హై అలర్ట్ ప్రకటించింది. 

రాక్షసి అలలు.. భీకరమైన గాలులు.. కుండపోత వర్షంతో.. ఒడిశాపై ఫోని తుఫాను విరుచుకుపడింది. ప్రచండ వేగంగా ఒడిశాను తాకిన తుఫాన్.. కోల్‌కతా మీదుగా బంగ్లాదేశ్‌ వైపుగా పయనిస్తోంది. ప్రస్తుతం ఈ తుపాను ప్రభావంతో బలమైన గాలులు వీస్తున్నాయి. బంగ్లాదేశ్‌కి వెళ్లేలోపే తుపాను బలహీనపడనుందని వాతావరణశాఖ తెలిపింది. బాలాసోర్‌ వద్ద తుపాను మళ్లీ సముద్రంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తోంది. బంగ్లాదేశ్‌కన్నా ముందు ఫొని తుపాను కోల్‌కతాను తాకే అవకాశముండటంతో బెంగాల్‌ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది.

ఫొని ప్రభావంతో ఇప్పటికే సుమారు 200 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. రాకాసి గాలులు, భారీ వర్షంతో కోల్‌కతా నగరం బీభత్సంగా మారింది. తుఫాను ముంచుకొస్తున్న వేళ బెంగాల్ ప్రభుత్వం అప్రమత్తమైంది. కోల్‌కతా పశ్చిమ మిడ్నాపూర్, ఉత్తర 24 పరగణాలు, హౌరా, హుగ్లీ, ఝార్‌గ్రామ్, సుందర్‌బన్, జిల్లాల్లో అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. బెంగాల్ ప్రభుత్వం స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. సముద్ర తీర ప్రాంతాల నుండి పర్యాటకులను వెళ్లిపోవాలని సూచించింది. మత్స్యకారులను సముద్రం లోనికి వెళ్లకుండా  హెచ్చరికలు జారీ చేసింది.  లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించింది. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి.. పరిస్థితిని సీఎం మమతా బెనర్జీ పర్యవేక్షిస్తున్నారు. 

తుఫాను బాధితులకు కావలసిన పునరావాస కేంద్రాలను, వారికి కావలసిన మందులను, ఆహారపదార్థాలను ఎక్కడికక్కడ అందించాలని మమతా బెనర్జీ  ఆదేశించారు. అటు తుఫాను ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారటంతో కోల్ కతా పోర్ట్ నుండి ఇతర ప్రాంతాలకు వెళ్ళవలిసిన షిప్‌లను క్యాన్సిల్ చేశారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లోని సర్వీసులను రద్దు చేశారు. ఎయిర్‌పోర్టును మూసేశారు. దీంతో చాలా విమానాలు రన్ వే పైనే నిల్చిపోయాయి.