చనిపోయాడని భావించి చితిపేరిస్తే.. బతికొచ్చాడు

సొంత మనిషి చనిపోయాడని కుటుంబ సభ్యులతో పాటు బంధువులు ఆవేదనలో మునిగిపోయారు. శోకంతో నిండిన మనస్సులతోనే చితికి చేర్చేందుకు బయల్దేరారు. సాంప్రదాయబద్ధంగా నిప్పంటించేందుకు వెళ్లే ముందు శవంపై పడి అంతా బోరుమన్నారు. ఇంతలో ఆ వ్యక్తి శ్వాస తీసుకుంటున్న విషయం ఒకరు గుర్తించి ఆశ్చర్యానికి గురయ్యాడు. వెంటనే ప్రథమచికిత్స చేసి హాస్పిటల్‌కు తరలించారు. 

ఒడిశాలోని గంజాం జిల్లాలో లావుఖా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. సురడా పోలీస్ స్టేషన్ పరిధిలోని శాసన పంచాయతీ లావుఖాలొ ఆదివాసీ గ్రామవాసి సిమాంచల మల్లిక్ (52) నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు. అలాగే శనివారం మేత కోసం మందను సమీప అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. సాయంత్రం మేకలు ఇంటికి వచ్చాయి కానీ, మల్లిక్ రాలేదు.

గాలింపు చేస్తే ఆదివారం ఓ చోట పడిపోయి ఉండటం గమనించారు. చనిపోయినట్లుగా భావించి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. బంధువుల రోధనలతో, కన్నీళ్లతో శ్మశానం వరకూ తీసుకెళ్లారు. తీరా చితికి నిప్పటించేందుకు వెళ్లే ముందు ఊపిరి తీసుకోవడం గమనించి హాస్పిటల్‌కు తరలించారు. చనిపోయి తిరిగొచ్చాడని భావిస్తూ మల్లిక్‌ను చూసేందుకు జనాలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. 

తాను జ్వరం కారణంగా స్పృహ కోల్పోయానని చితికి నిప్పు పెడుతుండగా వేడికి స్పృహ కలగడంతో లేవగలిగానని బాధితుడు చెబుతున్నాడు.