అమర జవాన్ల తల్లులకు మంత్రి పాదాభివందనం 

  • Publish Date - March 5, 2019 / 04:26 AM IST

డెహ్రాడూన్‌ : పుల్వామా ఆత్మాహుతి దాడిలో అమరులైన జవాన్ల తల్లులకు రక్షణమంత్రి నిర్మలా సీతారామన్ పాదాభివందనం చేశారు. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లో ఫిబ్రవరి 4న జరిగిన ఓ కార్యక్రమంలో రక్షణ మంత్రి నిర్మలాసీతారామన్  పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ‘శౌర్య సమ్మాన్ సమరోహ్’ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అమర జవాన్ల తల్లులకు శాలువతో సత్కరించి.. మంత్రి ఘనంగా సన్మానించారు. అనంతరం వారి పాదాలకు నమస్కరించి వారిపై తనకున్న గౌరవాన్ని తెలియజేశారు. 
 

పాదాలకు నమస్కరించేందుకు మంత్రి కిందకు వంగుతుండడంతో అవాక్కైన కొందరు తల్లులు వారించినా నిర్మల పట్టించుకోలేదు. అమరవీరుల తల్లులకు మంత్రి ఇస్తున్న గౌరవాన్ని చూసిన అధికారులు..కార్యక్రమానికి హాజరైన వారు చప్పట్లో మంత్రిని అభినందించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో పలువురి ప్రశంసలు పొందుతోంది. కాగా పుల్వామాలో పాక్ ఉగ్రవాదులు చేసిన మానవబాంబు దాడిలో భారత్ కు చెందిన 40మంది జవాన్లు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ దాడి అనంతరం పాక్ పై భారత్ సర్జికల్ దాడులు..అనంతరం పాక్ – భారత్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న విషయం తెలిసిందే.