దేశ వ్యాప్తంగా ఆసక్తికరంగా మారిన దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల#delhielection పోలింగ్ ప్రారంభమైంది. శనివారం(ఫిబ్రవరి 08,2020) ఉదయం 8 గంటలకు పోలింగ్ షురూ
దేశ వ్యాప్తంగా ఆసక్తికరంగా మారిన దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల#delhielection పోలింగ్ ప్రారంభమైంది. శనివారం(ఫిబ్రవరి 08,2020) ఉదయం 8 గంటలకు పోలింగ్ షురూ అయ్యింది. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగుస్తుంది. మొత్తం 70 శాసనసభ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరుగుతోంది. పోలింగ్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. మొత్తం 60వేల మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉన్నారు. ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని పోలింగ్ కేంద్రాల దగ్గర పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
70 స్థానాలకు 672 మంది పోటీ:
ఎన్నికల బరిలో మొత్తం 672 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. కోటి 47 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. సీఎం కేజ్రీవాల్ పోటీ చేస్తున్న న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానానికి 26 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఢిల్లీలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోరు నెలకొంది. ఫిబ్రవరి 11న ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు.#delhielection
ప్రచారంలో ఆప్, బీజేపీ పోటీ:
ఓటర్లను ఆకర్షించడానికి ఆప్, బీజేపీ, కాంగ్రెస్ తమ శక్తియుక్తులను ఒడ్డాయి. రాజకీయాలతోపాటు పౌరసత్వ సవరణ చట్టం, నిరుద్యోగం వంటి అంశాలను ప్రచార అస్త్రాలుగా చేసుకున్నారు. ప్రచారంలో ప్రధానంగా ఆప్, బీజేపీ పోటీపడ్డాయి. ప్రధాని మోడీ రెండు బహిరంగ సభల్లో ప్రసంగించగా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా పలు సభల్లో మాట్లాడారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, యూపీ సీఎం ఆదిత్యనాథ్ ప్రచారంలో పాల్గొన్నారు. అభివృద్ధి నినాదంతో ప్రచారానికి శ్రీకారం చుట్టిన బీజేపీ, తర్వాత షాహీన్ బాగ్‌లో సీఏఏ వ్యతిరేక నిరసనకారులను లక్ష్యంగా చేసుకుంది.
ఢిల్లీ ఫలితాలు తుక్డే-తుక్డే గ్యాంగ్‌కు షాక్ ఇస్తాయి:
ఢిల్లీ ఫలితాలు#delhielection తుక్డే-తుక్డే గ్యాంగ్‌కు షాకిస్తాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రచారంలో అన్నారు. ఆప్, కాంగ్రెస్ పార్టీలే లక్ష్యంగా ఘాటు విమర్శలు చేశారు. షాహీన్ బాగ్ నిరసనలు ఆప్, కాంగ్రెస్ జాయింట్ వెంచర్ అని విమర్శించారు. అందుకే దీని గురించి చర్చించడంతో కేజ్రీవాల్, రాహుల్ ఆందోళన చెందుతున్నారని చెప్పారు. దేశ భద్రత ఎన్నికల అంశం కాదా అని ప్రశ్నించారు. షాహీన్ బాగ్ దగ్గర కూర్చున్నవారు జిన్నా వాలీ ఆజాదీకి ఎందుకు డిమాండ్ చేస్తున్నారని నిలదీశారు అమిత్ షా.
సీఎం ఎవరో తెలియనప్పుడు బీజేపీకి ఓటెందుకేయాలి?
సీఎం కేజ్రీవాల్ ఆప్ తరఫున ప్రచారానికి నేతృత్వం వహించారు. ఢిల్లీలో సీఎం అయ్యే సామర్థ్యం గల బీజేపీ నేతలు ఒక్కరూ లేరని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తమను మళ్లీ గెలిపిస్తే ఇప్పటి వరకు అమలులో ఉన్న ఉచిత పథకాలతోపాటు కొత్త పథకాలనూ అమలు చేస్తామని చెప్పారు. అనధికారిక కాలనీల్లో ఇళ్ల రిజిస్ట్రేషన్‌తోపాటు షాహీన్ బాగ్ దగ్గర ఆందోళన చేస్తున్న వారిని అక్కడి నుంచి తొలిగించటం వరకూ కేంద్రం చేసిందేమీ లేదన్నారు. సీఎం అభ్యర్థెవరో తెలియనప్పుడు బీజేపీకి ఓటేందుకు వేయాలని ప్రజలు ప్రశ్నిస్తున్నారని కేజ్రీవాల్ ప్రచారం చేశారు.
బీజేపీకి ఓటేయాలని ఆప్ ప్రచారం:
బీజేపీ నేతలు కేజ్రీవాల్‌ను ఉగ్రవాది అనడంపై ఆప్ నేతలు 3 రోజులు మౌన ప్రదర్శనలతోపాటు ఇంటింటి ప్రచారం చేశారు. ఢిల్లీవాసులు కేజ్రీవాల్‌ను కొడుకుగా నమ్మితే ఆమ్ ఆద్మీకి ఓటేయాలని, ఉగ్రవాదిగా భావిస్తే బీజేపీకి ఓటు వేయాలని కోరారు. గతంలో వరుసగా మూడు సార్లు ఢిల్లీ పీఠం దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ ఈసారి ప్రచారంలో పోటీ పడలేకపోయింది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు ప్రచారం చేసినప్పటికీ.. కాంగ్రెస్ హవా ఏమంత కనిపించ లేదు.
2015 ఫలితం రిపీట్ అవుతుందా?
అరవింద్ కేజ్రీవాల్ కు మరోసారి ప్రభుత్వ పగ్గాలు అప్పగిస్తారా లేదా బీజేపీకి అవకాశమిస్తారా ఇద్దరికీ కాకుండా కాంగ్రెస్ కు పాలనా పగ్గాలు అప్పజెబుతారా అన్నది ఫిబ్రవరి 11న చూడాలి. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ 2015ను రిపీట్ చేయాలన్న ఆశతో ఎన్నికలకు వెళ్లింది. 2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ కు 67 సీట్లు వచ్చిన విషయం తెలిసిందే. అయితే 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఢిల్లీలోని మొత్తం 7స్థానాల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. అదే ఊపుతో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లింది బీజేపీ.
* ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
* ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్
* మొత్తం 70 శాసనసభ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్
* ఎన్నికల బరిలో మొత్తం 672 మంది అభ్యర్థులు
* సీఎం కేజ్రీవాల్ పోటీచేస్తున్న న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానానికి 26 మంది అభ్యర్థులు
* ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోరు
* ఈ నెల 11న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు