×
Ad

Delhi Blast: ఢిల్లీలో భారీ పేలుడుపై మోదీ, అమిత్ షా, రాజ్‌నాథ్‌ ఏమన్నారంటే? వివరాలు వెల్లడి..

సమీపంలోని సీసీటీవీ కెమెరాలన్నీ పరిశీలించేందుకు ఆదేశాలు ఇచ్చానని అమిత్‌ షా అన్నారు.

Delhi Blast: డిల్లీ ఎర్ర కోట మెట్రోస్టేషన్‌ వద్ద కారులో పేలుడు సంభవించిన నేపథ్యంలో దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. “ఇవాళ సాయంత్రం ఢిల్లీలో జరిగిన పేలుడులో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలుపుతున్నాను. గాయపడినవారు త్వరగా కోలుకోవాలి. ప్రభావితులకు అధికారులు సాయం అందిస్తున్నారు. హోంమంత్రి అమిత్‌ షా, ఇతర అధికారులతో పరిస్థితిని సమీక్షించాను” అని చెప్పారు.

పోలీసు ఉన్నతాధికారులతో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా మాట్లాడారు. ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌ సతీష్‌ గోల్చా, ఇతర అధికారులతో సమావేశమయ్యారు.

Also Read: హైదరాబాద్‌లో వాహనాల తనిఖీలు.. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, మాల్స్ వద్ద పోలీసుల గస్తీ.. సజ్జనార్‌ కీలక సూచన

ఆ తర్వాత అమిత్‌ షా.. లోక్‌నాయక్‌ ఆసుపత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. అంతకుముందు అమిత్‌ షా మీడియాతో మాట్లాడుతూ.. “ఇవాళ సాయంత్రం సుమారు 7 గంటల సమయంలో ఎర్రకోట సమీపంలోని సుభాష్‌మార్గ్‌ ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద హ్యుందాయ్‌ ఐ20 కారులో పేలుడు జరిగింది.

పేలుడు కారణంగా కొంతమంది పాదచారులు గాయపడ్డారు, కొన్ని వాహనాలు దెబ్బతిన్నాయి. ప్రారంభ నివేదికల ప్రకారం కొందరు ప్రాణాలు కోల్పోయారు. పేలుడు సమాచారాన్ని అందుకున్న 10 నిమిషాలలోపు ఢిల్లీ క్రైమ్‌ బ్రాంచ్‌, ఢిల్లీ స్పెషల్‌ బ్రాంచ్‌ బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. ఎన్‌ఎస్‌జీ, ఎన్‌ఐఏ బృందాలు ఎఫ్‌ఎస్ఎల్‌తో కలిసి సమగ్ర దర్యాప్తు ప్రారంభించాయి.

సమీపంలోని సీసీటీవీ కెమెరాలన్నీ పరిశీలించేందుకు ఆదేశాలు ఇచ్చాను. ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌తో, స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్‌చార్జ్‌తో మాట్లాడాను. ఇద్దరూ సంఘటనా స్థలంలో ఉన్నారు. అన్ని కోణాలను పరిశీలిస్తూ సమగ్ర విచారణ చేస్తాము” అని తెలిపారు.

రక్షణ మంత్రి రాజనాథ్‌సింగ్‌ స్పందిస్తూ.. “ఢిల్లీలో జరిగిన కారు పేలుడు సంఘటన చాలా బాధాకరం, కలతపెట్టింది. ఈ విషాద సమయంలో మరణించిన వారి కుటుంబాలకు సానుభూతి తెలుపుతున్నాను. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను” అని అన్నారు. కాగా, ఒక అనుమాతుడిని అదుపులోకి తీసుకుని ఢిల్లీ పోలీసులు విచారిస్తున్నారు.