పిజ్జా కావాలా నాయానా : అయితే..కిలో ప్లాస్టిక్ తీసుకురండి

పిజ్జా కావాలా నాయానా : అయితే..కిలో ప్లాస్టిక్ తీసుకురండి..టీ, సమోసా, పకోడీలు వంటి స్నేక్స్ కావాలంటే మరో పావుకిలో ప్లాస్టిక్ వ్యర్థాలు తెమ్మంటున్నారు ఢిల్లీలోని ద్వారకాలోని రెండు ఫుడ్ కోర్టులు. ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించటానికి దానిపై అవగాహన కలిగించటానికి ఫుడ్ కోర్టు నిర్వాహకులు ఈ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీనికి ఫుడ్ కోర్ట్ నిర్వాహకులు ‘ గార్బేజ్ కేఫ్’ అని పేరు పెట్టారు.
ప్లాస్టిక్..ప్లాస్టిక్..ప్లాస్టిక్. ఎక్కడ చూసినా ప్లాస్టిక్. దీంతో పర్యావరణానికి ఎంతో నష్టం కలుగుతోంది. ఇదే కొనసాగితే మానవ మనుగడ కూడా ప్రశ్నార్థకంగా మారకతప్పదంటున్నారు పర్యావరణవేత్తలు. ఈ ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రణ కోసం..ప్లాస్టిక్ వినియోగాన్ని మాన్పించటం కోసం ఎన్నో స్వచ్ఛంధ సంస్థలు పనిచేస్తున్నాయి. దేశంలో పలు కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీనిపై అవగాహన కల్పించేందుకు స్వచ్ఛంద సంస్థలు మందుకువస్తున్నాయి.
ఈ క్రమంలో ఢిల్లీలోని ద్వారకాలోని రెండు ఫుడ్ కోర్టులలో ప్లాస్టిక్‌కు బదులుగా టిఫిన్స్ ఇచ్చే కార్యక్రమం చేపట్టారు. ద్వారకా సెక్టార్-12 లోని సిటీ సెంటర్ మాల్, సెక్టార్-23లోని వర్థమాన్ మాల్‌కు వచ్చిన జనం ప్లాస్టిక్ ఇచ్చి టిఫిన్లు చేస్తున్నారు. ఈ రెస్టారెంట్ల ముందు దీనికి సంబంధించిన బ్యానర్ కట్టటంతో ప్రజల్లో మంచి స్పందన వస్తోంది. ఈ బ్యానర్లపై కిలో ప్లాస్టిక్‌కు బదులుగా దోశ, పిజ్జా, 250 గ్రాముల ప్లాస్టిక్‌కు బదులుగా సమోసా-చాయ్, బ్రెడ్ పకోడీ ఇస్తామని తెలిపారు.
ప్లాస్టిక్ వినియోగంతో మూగ జీవాలు ఎన్నో ప్రాణాలు కోల్పోతున్నాయి. సముద్రాలలో ప్లాస్టిక్ వ్యర్థాలతో ఇప్పటికే ఎన్నో జీవులు అంతరించిపోయే పరిస్థితికి చేరుకున్నాయి. భారీ తిమింగిలాలు సైతం ఈ ప్లాస్టిక్ భూతానికి బలైపోతున్నాయి. భూమిపై ఉండే జంతువులు ప్లాస్టిక్ వల్ల చనిపోతున్నాయి. అవి తినే ఆహారంతో పాటు మనుషులు వాడి పడేసిన ప్లాస్టిక్ వాటి కడుపులోకి చేరి ప్రాణాలు కోల్పోతున్నాయి. ఇదే కొనసాగితే..మానవ మనుగడను కూడా ప్లాస్టిక్ వల్ల ప్రశ్నార్థం కాకతప్పదని పర్యావరణ వేత్తలు పదే పదే హెచ్చరిస్తున్నారు.