ఓ కన్న తండ్రి తన కుమారుడి కోసం రాత్రి, పగలు నిద్ర మానుకొని అతడికి ఆక్సిజన్ అందించిన ఘటన అందరి కళ్లల్లో నీళ్లు తెప్పించి. ఆక్సిజన్ అందక తల్లడిల్లిపోతున్న చిన్నారిని బ్రతికించుకొనేందుకు ఆ తండ్రి కన్నీళ్లు దిగమింగుకొని ఆక్సిజన్ అందించిన ఘటన చూసి అందరూ అతడి కుమారుడు తర్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ హాస్పిటల్(ఎల్ఎన్ జేపీ) గవర్నమెంట్ హాస్పిటల్ లో ఈ ఘటన జరిగింది.
తూర్పు ఢిల్లీలోని ఖజూరీలో నివసించే ఆశాఫాక్.. గతేడాది డిసెంబర్ లో అర్థరాత్రి అకస్మాత్తుగా సృహకోల్పోయిన తన కుమారుడు ఫర్హాన్ ను జయప్రకాష్ నారాయణ్ హాస్పిటల్(ఎల్ఎన్ జేపీ) గవర్నమెంట్ హాస్పిటల్ లో చేర్పించాడు. కొన్ని రోజులు డాక్టర్లు చిన్నారిని ఎమర్జెన్సీ వార్డులో ఉంచారు. వారం రోజుల క్రితం వార్డు నుంచి చిన్నారిని షిఫ్ట్ చేశారు. ఫర్హాన్ కు వెంటిలేటర్ సదుపాయం కల్పించాల్సిన అవసరముందని, హాస్పిటల్ లో ఏ వెంటిలేటర్ ఖాళీగా లేకపోవడంతో చిన్నారి తండ్రికి చేతితో పనిచేసే అంబూ బ్యాగ్ ఇచ్చినట్లు డాక్టర్లు తెలిపారు.
అంబూబ్యాగ్ సాయంతో ఆశాఫక్ అంబూ బ్యాగ్ వత్తుతూ చిన్నారికి ఊపిరి అందిస్తున్నారు. ఏడు రోజులుగా ఇలానే చిన్నారికి ఆక్సిజన్ అందేలా చూస్తున్నారు. చిన్నారి బ్రెయిన్ డెడ్ కు గురయ్యాడని, బ్రతికే అవకాశం లేదని, వెంటిలేటర్ సదుపాయం కల్పించినా బ్రతికే అవకాశం ఉండక పోవచ్చని హాస్పిటల్ డాక్టర్ కిశోర్ సింగ్ తెలిపారు. అయితే తన కుమారుడు ఖచ్చితంగా బ్రతుకుతాడని ఆశాఫక్ అంటున్నాడు. చిన్నారి పరిస్థితిని చూసిన సామాజిక కార్యకర్త అశోక్ అగర్వాల్ ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించడంతో స్పందించిన కోర్టు చిన్నారికి తక్షణమే వెంటిలేటర్ ఫెసిలిటీ కల్పించాలని ఆదేశించింది.