గుజరాత్ లోని ఓ స్కూల్ యాజమాన్యం చేసిన పని ఇప్పుడు చర్చకు దారితీసింది. క్వశ్చన్ పేపర్ లో అడిగిన ప్రశ్నలు వివాదానికి దారితీశాయి. విద్యార్థులను షాక్ కు గురి చేశాయి.
గుజరాత్ లోని ఓ స్కూల్ యాజమాన్యం చేసిన పని ఇప్పుడు చర్చకు దారితీసింది. క్వశ్చన్ పేపర్ లో అడిగిన ప్రశ్నలు వివాదానికి దారితీశాయి. విద్యార్థులను షాక్ కు గురి చేశాయి. ఇంతకీ ఎగ్జామ్ పేపర్ లో వారు అడిగిన ప్రశలు ఏంటో తెలుసా? జాతిపిత మహాత్మా గాంధీ ఎలా ఆత్మహత్య చేసుకున్నారు? మద్యం విక్రయాలు పెంచడానికి ఏం చేయాలి? ఇవీ.. వారు అడిగిన ప్రశ్నలు.
భారత స్వాతంత్ర్య సంగ్రామం గురించి తెలిసిన ఎవరికైనా గాంధీని గాడ్సే కాల్చి చంపాడన్న సంగతి తెలిసిందే. కానీ ప్రశ్నపత్రంలో గాంధీ ఎలా ఆత్మహత్య చేసుకున్నారు అన్న ప్రశ్నను అడగడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ ప్రశ్నను చూసి విద్యార్థులే కాదు విద్యాశాఖ అధికారులు కూడా ఆశ్చర్యపోయారు. అదీ గాంధీ పుట్టిన రాష్ట్రమైన గుజరాత్ లో ఇలాంటి ఘటన జరగడం గమనార్హం.
గాంధీనగర్ లోని సుఫలాంశాల వికాస్ సంకుల్ స్కూల్ లో 9వ తరగతి ఇంటర్నల్ ఎగ్జామినేషన్ లో ఈ ప్రశ్నను అడిగారు. ఈ స్కూల్ కొందరు వ్యక్తుల ఆధ్వర్యంలో నడుస్తున్నా ప్రభుత్వం నుంచి అన్ని రకాల నిధులు మంజూరవుతున్నాయి. ఇక క్లాస్ 12 విద్యార్థులకు కూడా ఇలాంటి వింత ప్రశ్నే ఎదురైంది. మీ ప్రాంతంలో మద్యం విక్రయాలు పెంచడానికి ఏం చేయాలో తెలుపుతూ జిల్లా పోలీసు ఉన్నతాధికారికి లేఖ రాయండి అని అడగడం విమర్శలకు తావిస్తోంది.
దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో విద్యాశాఖ అధికారులు స్పందించారు. విద్యార్థులకు ఇలాంటి ప్రశ్నలు అడగటం కరెక్ట్ కాదన్నారు. దీనిపై విచారణకు ఆదేశించారు. ఈ క్వశ్చన్ పేపర్ తయారు చేసినవారిపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.