Udhayanidhi Stalin : సనాతన ధర్మంపై మరోసారి డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ కీలక వ్యాఖ్యలు.. నా ఉద్దేశం అదికాదంటూ వివరణ..
Udhayanidhi Stalin : తన మాటలను వక్రీకరిస్తున్నారు. సనాతన ధర్మాన్ని కించపర్చడం తన ఉద్దేశం కాదు. ప్రజలను అగ్ర, నిమ్న వర్గాలుగా విభజించే కుల వ్యవస్థను నిర్మూలించాలనే ఆలోచనను తాను వ్యక్తం చేశానని డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ అన్నారు.
- Harish Thanniru
- Published on- May 15, 2026 / 02:02 PM IST
Udhayanidhi Stalin
Udhayanidhi Stalin : డీఎంకే నేత, మాజీ మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై పలుసార్లు కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తామని తమిళనాడు ఎన్నికల ముందు పలుసార్లు పేర్కొన్నారు. అయితే, ఇటీవల అసెంబ్లీలో సీఎం విజయ్ బలపరీక్ష సమయంలో కూడా ఆయన సనాతన ధర్మంపై కీలక వ్యాఖ్యలు చేశారు. సామాజిక న్యాయానికి వ్యతిరేకమైన సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని అన్నారు. ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో తన వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా ఉదయనిధి స్టాలిన్ స్పందించారు.
తన మాటలను వక్రీకరిస్తున్నారని అన్నారు. సనాతన ధర్మాన్ని కించపర్చడం తన ఉద్దేశం కాదని, ప్రజలను అగ్ర, నిమ్న వర్గాలుగా విభజించే కుల వ్యవస్థను నిర్మూలించాలనే ఆలోచనను వ్యక్తం చేశానని అన్నారు. ప్రతిఒక్కరికీ సమాజంలో సమాన హక్కులు ఉండాలని తాను కోరుకుంటున్నట్లు తెలియజేశారు. సనాతన విధానాలను నిర్మూలించడం అంటే.. ప్రజలు గుడికి వెళ్లకూడదని కాదు.. ప్రతిఒక్కరికీ సమాన హక్కులు ఇవ్వాలని, ఆలయాల్లోనే కాదు, యావత్ సమాజంలో సమానత్వం పాటించాలని నా ఉద్దేశం అన్నారు.
పెరియార్, అంబేడ్కర్ చెప్పిన సూత్రాల గురించి తాను అసెంబ్లీలో మాట్లాడా. ఎంత మంది ఎన్ని విమర్శలు చేసినా తాను వెనక్కు తగ్గను. కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటా. సనాతన ధర్మానికి తాము వ్యతిరేకం కాదు. అదే సమయంలో అసమానతలు, అణచివేతను తీవ్రంగా వ్యతిరేకిస్తామని తెలిపాడు.
