కాల్పుల విరమణకు భారత్, పాకిస్థాన్ ఒప్పుకున్నాయి.. ఇక తక్షణమే..: ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు.

భారత్, పాకిస్థాన్ కాల్పుల విరమణకు అంగీకరించాయంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు. యుద్ధ సమయంలో ఇరు దేశాలు విజ్ఞత పాటించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా మధ్యవర్తిత్వంతో సుదీర్ఘ మంతనాల తర్వాత తక్షణ, సంపూర్ణ విరమణకు ఇరు దేశాలు ఒప్పుకున్నాయని చెప్పారు. ఇటు భారత్, పాకిస్థాన్‌ కూడా కాల్పుల విరమణపై అధికారికంగా ప్రకటన చేశాయి.

కాగా, భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన న్యూఢిల్లీలోని ఆయన నివాసంలో ఇవాళ కీలక సమావేశం జరిగింది. ఇందులో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్), త్రివిధదళాధిపతులు పాల్గొన్నారు.

భారత్‌లోని 26 ప్రాంతాలపై పాకిస్థాన్‌ దాడికి యత్నించిన నేపథ్యంలో దానికి ప్రతిస్పందనగా శనివారం తెల్లవారుజామున పాక్‌లోని నాలుగు వైమానిక స్థావరాలపై ఇండియా దాడులు చేసింది. అంతేగాక, రఫీకి, మురిద్, చక్లాలా, రహీమ్ యార్ ఖాన్, సుక్కూర్, చునియన్‌లోని పాకిస్థాన్ సైనిక టార్గెట్‌పై, అలాగే పస్రూర్, సియాల్‌కోట్‌లోని వైమానిక స్థావరాల వద్ద రాడార్ సైట్‌లపై భారత యుద్ధ విమానాలతో అత్యంత కచ్చితత్వంతో దాడులు జరిగాయని భారత ఆర్మీ కల్నల్ సోఫియా ఖురేషి పేర్కొన్నారు.