PM Modi – Gold Ban: గోల్డ్ బ్యాన్, ఖర్చులు తగ్గించుకోండి, త్యాగాలకు సిద్ధంకండి.. ప్రధాని మోదీ సంచలన పిలుపు

అంతర్జాతీయ పరిస్థితుల వల్ల పుత్తడి ధరలు పెరుగుతున్నాయన్న ప్రధాని మోదీ.. బంగారం కొనుగోళ్లను తగ్గించుకోవాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.

  • Updated on- May 10, 2026 / 09:11 PM IST

PM Modi – Gold Ban: ప్రధాని మోదీ దేశ ప్రజలకు సంచలన పిలుపునిచ్చారు. బంగారం కొనుగోళ్లను మనం తగ్గించుకోవాలన్నారు. ఏడాది పాటు బంగారం కొనుగోళ్లను పూర్తిగా నిలిపివేద్దామన్నారు. పండుగలు, శుభకార్యాలకు పసిడి కొనుగోళ్లను తగ్గించుకోవాలన్నారు. అంతర్జాతీయ పరిస్థితుల వల్ల పుత్తడి ధరలు పెరుగుతున్నాయన్న ప్రధాని మోదీ.. బంగారం కొనుగోళ్లను తగ్గించుకోవాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. బంగారం దిగుమతులు తగ్గితే
విదేశీమారక ద్రవ్యం పెరుగుతుందన్నారు.

హైదరాబాద్ పర్యటనలో భాగంగా సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో బీజేపీ బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడారు. పలు అంశాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రజలకు కీలక విజ్ఞప్తి చేశారు. ప్రపంచమంతా సంక్షోభంలో ఉందన్న ప్రధాని మోదీ ఈ కష్ట సమయంలో దేశమంతా ఐక్యంగా ఉండాలని అప్పీల్ చేశారు. అవసరమైతే ప్రజలు త్యాగాలకు సిద్ధం కావాలన్నారు. త్యాగాలు చేసి దేశ భక్తిని చాటాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్, యూరియా ధరలు అమాంతం పెరిగాయన్నారు మోదీ. అయితే, ప్రజలపై భారం పడకుండా రెండు నెలలుగా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించుకోండి..

పశ్చిమాసియా యుద్ధం వల్లే కలిగే నష్టాన్ని కేంద్రమే భరిస్తోందని వెల్లడించారు. ధరలు పెంచడం లేదు, ప్రజలపై భారం వేయడం లేదన్నారు. పెట్రోల్, డీజిల్ ను పరిమితంగా వినియోగించాలని.. ఎలక్ట్రిక్ వాహనాలు ఉపయోగించాలని ప్రధాని మోదీ చెప్పారు. ప్రజా రవాణాను వినియోగించుకోవాలని, మెట్రోలో ప్రయాణం చేయాలని పిలుపునిచ్చారు. అంతేకాదు ప్రజలు దుబారా ఖర్చులు తగ్గించుకోవాలని విజ్ఞప్తి చేశారు. రైతులు సేంద్రీయ వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. వంట నూనెల వినియోగం తగ్గించాలన్నారు. ఈ చర్యల ద్వారా విదేశీ మారక ద్రవ్య నిల్వలను కాపాడుకోవాలని ప్రధాని మోదీ కోరారు.

దేశంలో మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్..

దేశంలో మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం రావాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ ప్రతిపాదించారు. కరోనా టైమ్ లో చేసినట్టు మళ్లీ చేయండి అని పిలుపునిచ్చారాయన. దేశం కోసం చావడం కాదు బతకాలి అని నినదించారు. యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయని, క్రూడాయిల్ రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయని వాపోయారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలంటే.. అందరూ మెట్రో వాడాలని, అంతా మెట్రోలో వెళ్లాలని ప్రధాని కోరారు. కార్ పూల్ వాడండి అని, సామగ్రి పంపడానికి గూడ్స్ ట్రైన్లు వాడండి అని విజ్ఞప్తి చేశారు. విదేశీ మారక నిల్వలు తగ్గకుండా చూడడానికి చాలా ప్రయత్నాలు చేయాలన్నారు ప్రధాని మోదీ. అంతేకాదు ఏడాది వరకు విదేశీ ప్రయాణాలు పెట్టుకోవద్దని, టూర్లు పెట్టుకోవద్దని దేశ ప్రజలకు రిక్వెస్ట్ చేశారు.

బంగారం కొనడం ఆపేయండి..

”బంగారం కొనడం కొన్నాళ్లు ఆపేయండి. గతంలో సంక్షోభాలు వచ్చినప్పుడు జనం బంగారం దానం ఇచ్చేవారు. ఏడాది వరకు బంగారు ఆభరణాలు కొనొద్దు. ఏ ఫంక్షన్లు జరిగినా సరే గోల్డ్ కొనొద్దు. కెమికల్ పురుగు మందులు వాడొద్దు. దాని వల్ల మట్టి సాంద్రత కోల్పోతుంది. విదేశీ వస్తువులు మొత్తం బ్యాన్ చేయండి. మనం వీలైనంత త్వరగా స్వదేశీకి మారాలి” అని పిలుపునిచ్చారు ప్రధాని మోదీ.

”వంట నూనెలో స్వయం సమృద్ధి సాధించాలి. దేశంలో ఏర్పడిన పెట్రోల్, డీజిల్ సమస్యలను అధిగమిస్తాం. ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినా ప్రజలపై భారం పడకుండా చూశాం. ఎలక్ట్రిక్ వాహనాలతో పెట్రోల్, డీజిల్ సమస్యలు అధిగమించవచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్ లైన్ సమావేశాలు, వర్చువల్ మీటింగ్ లు మళ్లీ ఉపయోగించేలా చేస్తాం. విదేశీ పర్యటనలు, డెస్టినేషన్ మ్యారేజ్ లను తగ్గించుకోవాలి. పెట్రోల్, డీజిల్ కొరత దృష్ట్యా ప్రజా రవాణను ఉపయోగించుకోవాలి. ఎరువుల వినియోగం తగ్గించి భూసారాన్ని కాపాడాలి. విదేశీ వస్తువుల కొనుగోళ్లు తగ్గించాలి. రైతులు సోలార్ పంప్ లు వాడాలి” అని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.

Also Read: ప్రమాణ స్వీకారోత్సవం వేదికగా త్రిషకు బిగ్ షాకిచ్చిన విజయ్.. ఆ రూమర్స్‌కు చెక్..!