×
Ad

రూ.10 కోట్ల లంబోర్గిని కారుతో కోటీశ్వరుడి కుమారుడు రచ్చ రంబోలా.. వాహనాలు ధ్వంసం.. పలువురికి గాయాలు

శివమ్ మిశ్రా అనే యువకుడు మద్యం మత్తులో కాన్పూర్ వీఐపీ రోడ్డుపై లంబోర్గిని రెవుయెల్టో కారును వేగంగా నడిపాడు.

  • ఫుల్లుగా మద్యం తాగి కారును నడిపిన యువకుడు
  • ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నగరంలో ఘటన
  • కారులో నుంచి యువకుడిని లాగిన స్థానికులు

Lamborghini Crash: లంబోర్గిని కారుతో ఓ కోటీశ్వరుడి కుమారుడు నడిరోడ్డుపై రచ్చ రచ్చ చేశాడు. ఫుల్లుగా మద్యం తాగి ఆ కారును నడుపుతూ అదుపుతప్పి దూసుకెళ్లడంతో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి.. పలువురికి గాయాలయ్యాయి.

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటన తర్వాత పోలీసులు కారును స్వాధీనం చేసుకున్నారు.

ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. శివమ్ మిశ్రా అనే యువకుడు మద్యం మత్తులో కాన్పూర్ వీఐపీ రోడ్డుపై లంబోర్గిని రెవుయెల్టో కారును వేగంగా నడిపాడు.

Also Read: Rajastn Honeymoon Case : రాజస్థాన్ హానీమూన్ మర్డర్‌ కేసులో సంచలన విషయాలు.. 7ఏళ్ల తర్వాత కలుసుకున్నారు.. భర్తను చంపేశారు..

“ఆదివారం మధ్యాహ్నం సుమారు 3.15 గంటలకు రేవ్-3 మాల్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. పొగాకు వ్యాపారి కేకే మిశ్రా కుమారుడు శివమ్ మిశ్రా ఈ కారును నడిపినట్లు తెలుస్తోంది. ఈ లగ్జరీ కారు అదుపు తప్పి.. రోడ్డుపక్కన ఉన్న ప్రజలు, పలు వాహనాలపైకి దూసుకెళ్లి ఆ ప్రాంతంలో భయాందోళనలు రేపింది” అని సెంట్రల్ డీసీపీ అతుల్ కుమార్ శ్రీవాస్తవ తెలిపారు.

ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. కారు ముందుగా ఆటోరిక్షాను ఢీకొట్టి, తర్వాత రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిల్‌ను ఢీకొట్టి రైడర్‌ను సుమారు 10 అడుగుల ఎత్తుకు ఎగిరేలా చేసింది. మోటార్‌సైకిల్ ముందుచక్రంపైకి కారు ఎక్కి కొంత దూరం లాగుతూ వెళ్లి చివరికి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి ఆగింది.

గాయపడిన తౌఫీక్ అహ్మద్ పలుమీటర్లు దూరం ఎగిరిపడి తీవ్రగాయాలపాలయ్యాడు. అతడు రోడ్డుపక్కన నిలబడి తన బైక్ వద్ద ఉన్న సమయంలో కారు ఢీకొట్టింది. మరికొందరికి కూడా గాయాలయ్యాయి.

ఈ ప్రమాదం తర్వాత కారు ఆపకుండా మిశ్రా అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి. మరో కారులో ఉన్న అతడి బౌన్సర్లు అతడిని రక్షించేందుకు ప్రయత్నించారు. వారు ప్రజలతో దురుసుగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆగ్రహంతో ఊగిపోయిన ప్రజలు లంబోర్గిని రెవుయెల్టో కారు అద్దాలను పగలగొట్టి మిశ్రాను బయటకు లాగారు.

చివరికి పోలీసులు అక్కడికి చేరుకుని మిశ్రాను స్థానికుల నుంచి రక్షించి అతడిని, గాయపడిన వారిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. సుమారు 10 కోట్ల రూపాయల విలువ ఉన్న లంబోర్గిని లగ్జరీ కారు రిజిస్ట్రేషన్‌ ఉత్తర పశ్చిమ ఢిల్లీ రోహిణి ప్రాంతంలో నమోదై ఉంది.