కర్ణాటకలో ఇటీవల 15 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్,జేడీఎస్ పార్టీలకు ఓటర్లకు భారీ షాక్ ఇచ్చారు. ఇవాళ కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి బీజేపీ దూకుడును చూసి కాంగ్రెస్,జేడీఎస్ కార్యకర్తలు నాయకులు షాక్ అవడం మొదలుపెట్టారు. 12 స్థానాల్లో ఘన విజయం దిశగా బీజేపీ దూసుకెళ్తుంది. కాంగ్రెస్ కేవలం 2 స్థానాల్లోనే తన సత్తా చూపించగలిగింది. మరోవైపు ఉప ఎన్నికల ఫలితాలను పూర్తిగా ఎన్నికల కమిషన్ అధికారికంగా ప్రకటింకముందే కన్నడ రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత పదవికి మాజీ సీఎం సిద్దరామయ్య రాజీనామా చేశారు. ప్రజల తీర్పుని తాము గౌరవిస్తున్నట్లు ఆయన తెలిపారు. తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షురాలు సోనిమాగాంధీకీ పంపించినట్లు ఆయన తెలిపారు. విజయం కోసం తీవ్రంగా కృషి చేసినప్పటికీ ఆశించిన ఫలితాలు రాకపోవం పట్ల తాను నిజాయితీతో పశ్చాతాపం వ్యక్తం చేస్తున్నట్లు రాజీనామా లేఖలో సిద్దరామయ్య తెలిపారు. ఈ సమయంలో సీఎల్పీ లీడర్ గా దిగిపోవడం తన నైతిక బాధ్యత అని ఆ లేఖలో ఆయన తెలిపారు. మరోవైపు కేపీసీసీ అధ్యక్షుడు దినేష్ గుండురావ్ కూడా తన పదవికి రాజీనామా చేశారు.