ఎన్నికల కురుక్షేత్రం : సా.5 గంటలకు షెడ్యూల్ విడుదల

  • Publish Date - March 10, 2019 / 06:06 AM IST

సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు ఈసీ సిద్ధమైంది. ఆదివారం(మార్చి 10) సాయంత్రం 5గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రెస్ మీట్ నిర్వహించనుంది. విజ్ఞాన్ భవన్ లో ఎన్నికల షెడ్యూల్ ను ఈసీ ప్రకటించనుంది. లోక్ సభ ఎన్నికల షెడ్యూల్‌తో పాటు 4 రాష్ట్రాల(ఏపీ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం) అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తారని వార్తలు వస్తున్నాయి. 9 లేదా 10 విడతల్లో ఎలక్షన్స్ నిర్వహించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టాయి. షెడ్యూల్ ప్రకటించిన వెంటనే ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది. జూన్ 3న 16వ లోక్‌సభ పదవీ కాలం ముగియనుంది.

ఎన్నికల ప్రక్రియ మే 21లోగా పూర్తి చేసేందుకు వీలుగా షెడ్యూల్‌ రూపొందించినట్లు సమాచారం. జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నా, శాంతిభద్రతల దృష్ట్యా ఇప్పుడే నిర్వహించడం లేదని తెలుస్తోంది. అన్ని రాష్ట్రాల్లో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు పర్యటించి ఎన్నికల ఏర్పాట్లు తెలుసుకున్నారు. ఓటు హక్కు నమోదు, ఓటర్ల జాబితా ఫైనల్ చేయడానికి రాష్ట్రాలు కసరత్తును ముమ్మరం చేశాయి. 2019 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి 22.3 లక్షల బ్యాలెట్ యూనిట్లు, 16.3 లక్షల కంట్రోల్ యూనిట్లు, 17.3 లక్షల వీవీప్యాట్ యంత్రాలు అవసరమవుతాయని కేంద్ర ఎన్నికల సంఘం తేల్చింది.

2014 సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను మార్చి 5నే ఈసీ ప్రకటించింది. తెలంగాణలో ఏప్రిల్‌ 30న పోలింగ్‌ జరగ్గా ఏపీలో మే7న పోలింగ్‌ జరిగింది. ఈసారి 5వ తేదీ దాటినా షెడ్యూల్‌ జారీ చేయకపోవడంపై విపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. కాగా, షెడ్యూల్ విడుదలపై వస్తున్న ఆరోపణలను ఈసీ కొట్టిపారేసింది. షెడ్యూల్ విడుదలలో ఎలాంటి జాప్యం లేదని చెప్పింది. ప్రధాని అధికారిక కార్యక్రమాలకు, ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ఎలాంటి సంబంధం లేదని వివరించింది.