El Nino : సూపర్ ఎల్‌నినో వచ్చేస్తోంది.. రానున్న మూడు నెలలు భగభగలు.. హెచ్చరికలు జారీ
El Nino : ఎల్‌నినో తీవ్రత పెరగడం భారత్‌కు ఆందోళన కలిగించే అంశమే. ముఖ్యంగా రుతుపవనాలు, వ్యవసాయం, నీటి లభ్యత, ఉష్ణోగ్రతలపై దీని ప్రభావాన్ని నిశితంగా పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది.
- Harish Thanniru
- Published on- September 4, 2026 / 08:59 AM IST
El Nino : ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులపై ప్రభావం చూపే ఎల్‌నినో మరింత బలపడుతోంది. ఉష్ణమండల పసిఫిక్ ప్రాంతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరగడంతో.. ఈ ఏడాది చివరి నాటికి ఎల్‌నినో అత్యంత శక్తివంతమైన స్థాయికి చేరుకునే అవకాశం ఉందని ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) హెచ్చరించింది. ఈ ప్రభావం 2027 ఫిబ్రవరి వరకు కొనసాగే అవకాశం ఉందని తెలిపింది.
ఆధునిక వాతావరణ పర్యవేక్షణ ప్రారంభమైన తర్వాత నమోదయ్యే అత్యంత బలమైన ఎల్‌నినోలలో ఇది ఒకటిగా మారే అవకాశం ఉందని డబ్ల్యూఎంఓ పేర్కొంది. సముద్ర ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్దీ ఎల్‌నినో బలపడుతోందని, దీని ప్రభావంతో ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులు అస్థిరంగా మారే అవకాశముందని తెలిపింది.
భారతదేశంపై ప్రభావం ఎంత..?
ఎల్‌నినో ప్రభావం అన్ని దేశాల్లో ఒకే విధంగా ఉండదు. అయితే భారత్‌లో మాత్రం నైరుతి రుతుపవనాలపై ప్రభావం చూపి వర్షపాతం తగ్గే పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. చారిత్రకంగా ఎల్‌నినో బలహీన రుతుపవనాలతో సంబంధం కలిగి ఉన్నప్పటికీ.. ప్రతిసారీ ఇదే పరిస్థితి ఉంటుందని చెప్పలేమని వాతావరణ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే రుతుపవనాల వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉంటుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. మే నెలలో విడుదల చేసిన సవరించిన అంచనాల ప్రకారం.. సీజన్ వర్షపాతం దీర్ఘకాలిక సగటులో 90శాతం మాత్రమే ఉండొచ్చని తెలిపింది. ఆగస్టు నెలలోనూ దేశవ్యాప్తంగా వర్షపాతం సుమారు 16 శాతం లోటుగా నమోదైంది.
మూడు నెలలు భగభగలే..
సెప్టెంబర్ నుంచి నవంబర్ మధ్య కాలంలో ప్రపంచంలోని దాదాపు అన్ని భూభాగాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని డబ్యూఎంఓ తాజా అంచనా చెబుతోంది. అదే సమయంలో ప్రాంతాలను బట్టి వర్షపాతంలో భారీ వ్యత్యాసాలు ఉండొచ్చని హెచ్చరించింది.
డబ్ల్యూఎంఓ సెక్రటరీ జనరల్ సెలెస్టీ సాలో ప్రకారం.. స్పానిష్ బాషలో ఎల్‌నినో అంటే చిన్న బాలుడని అర్ధం. కానీ, వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలను ధ్వంసం చేయగల సత్తా ఉంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కరవు కాటకాలు, కార్చిచ్చులు, వరదలు నమోదవుతున్నాయి. ఎల్‌నినో తీవ్రతతో పాటు ఇవి కూడా మరింత ప్రమాదకరంగా మారనున్నాయి. ఈ అసాధారణ ఎల్ నినో పరిస్థితులను అంతే స్థాయిలో సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్ధమవ్వాలి. డబ్ల్యూఎంఓ యాబై ఏళ్ల చరిత్రలో ఎన్నడూలేనంత స్థాయిలో జాతీయ వాతావరణ సంస్థలు, జలవనరుల సేవలను అప్రమత్తం చేస్తున్నాం. మానవ ప్రాణ, జీవనోపాధి మార్గాలకు విఘాతం కలగకుండా ఎప్పటికప్పుడు సమాచారం అందించేది వీరే. ఐక్యరాజ్య సమితికి చెందిన అన్ని మానవీయ సేవల సంస్థలతో సమాచారం, విపత్తుల నిర్వహణలో సాయం, వ్యవసాయం, ఆరోగ్యం, జలవనరుల నిర్వహణలో సాయం అందిస్తామని అన్నారు.
