ISRO GSLV-F17 Launch : ఇస్రో ఖాతాలో మరో చారిత్రక విజయం.. ఈఓఎస్-05 ప్రయోగం దిగ్విజయం.. దీని వల్ల ఉపయోగాలు ఏమిటంటే?
ISRO GSLV-F17 Launch : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) ఖాతాలో మరో చారిత్రక ఘనత చేరింది.
ISRO GSLV-F17 Launch
ISRO GSLV-F17 Launch : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) ఖాతాలో మరో చారిత్రక ఘనత చేరింది. భూ పరిశీలన ఉపగ్రహం ఈఓఎస్-05ను మోసుకెళ్లిన జీఎస్ఎల్వి-F17 రాకెట్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి శుక్రవారం తెల్లవారుజామున 2:55 గంటలకు రాకెట్‌ను ప్రయోగించారు.
ప్రయోగం అనంతరం జీఎస్ఎల్వి-F17 రాకెట్.. ఈఓఎస్ -05 ఉపగ్రహాన్ని నిర్దేశిత సబ్-జియోసింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్‌లో విజయవంతంగా ప్రవేశపెట్టింది. సరిగ్గా 18 నిమిషాల తరువాత (3.13గంటలకు) ఈ ప్రక్రియ పూర్తయింది. ఉపగ్రహం పెరీజీ (భూమికి దగ్గరి బిందువు) 170 కిలోమీటర్లు అపోజీ (దూరపు బిందువు) 28,934 కిలోమీటర్లు కక్ష్యలోకి చేరుకుంది. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ డాక్టర్ వి. నారాయణన్ మిషన్ విజయవంతమైనట్లు ప్రకటించారు. 51.7 మీటర్ల ఎత్తు, 420.5 టన్నుల బరువున్న ఈ రాకెట్ ద్వారా చేపట్టిన ప్రతిష్టాత్మక జీఎస్ఎల్వీ సిరీస్‌లో ఇది 19వ ప్రయోగం కావడం విశేషం.
ఈఓఎస్-05 ప్రయోగం విజయవంతం అనంతరం ఇస్రో చైర్మన్ వి.నారాయణన్ మాట్లాడుతూ.. గగన్‌యాన్ తొలి మానవరహిత మిషన్‌పై కూడా కీలక సమాచారం వెల్లడించారు. ఈ ఏడాదిలోనే తొలి అన్‌క్రూడ్ గగన్‌యాన్ ప్రయోగాన్ని చేపట్టేందుకు పనులు వేగంగా, పద్ధతిగా కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నావిగేషన్ ఉపగ్రహం ఎన్వీఎస్-03తో పాటు మరో ఆరు ప్రయోగాలను చేపట్టాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది.
Another giant leap for India in Space!
Kudos to Team @isro on the successful launch of GSLV-F17/EOS-05.
EOS-05 is a state-of-the-art Earth Observation satellite and India’s first imaging satellite from Geosynchronous Orbit, enabling advanced imaging across visible, infrared,… pic.twitter.com/1HHJrWM7ze
— Dr Jitendra Singh (@DrJitendraSingh) September 3, 2026
36 వేల కిలోమీటర్ల ఎత్తు నుంచి భూమిపై నిఘా..
ఈఓఎస్-05ను అత్యాధునిక భూ పరిశీలన ఉపగ్రహంగా రూపొందించారు. భూమికి దాదాపు 36వేల కిలోమీటర్ల ఎత్తు నుంచి భారతదేశాన్ని నిరంతరం పరిశీలించే సామర్థ్యం దీనికి ఉంది. సమీప రియల్‌టైమ్‌లో చిత్రాలను అందించగలిగేలా ఉపగ్రహాన్ని రూపొందించారు. దృశ్య, ఇన్ఫ్రారెడ్, మల్టీస్పెక్ట్రల్, హైపర్‌స్పెక్ట్రల్ బ్యాండ్లలో అధునాతన చిత్రాలను తీసే సామర్థ్యం ఈఓఎస్-05కు ఉందని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. జియోసింక్రోనస్ ఆర్బిట్ నుంచి ఇమేజింగ్ చేసే భారత తొలి ఇమేజింగ్ ఉపగ్రహంగా EOS-05ను ఆయన పేర్కొన్నారు.
సాధారణంగా లో-ఎర్త్ ఆర్బిట్ (లియో), సన్ సింక్రోనస్ ఆర్బిట్లలో ఉండే ఉపగ్రహాలు ఒక ప్రాంతాన్ని ఫొటో తీయడానికి కొన్నిరోజుల నుంచి వారాల సమయం పడుతుంది. కానీ, ఈఓఎస్ -05 భూస్థిర కక్ష్యలో (జియో ఆర్బిట్) ఉంటూ.. ఒకే ఫ్రేమ్‌లో మొత్తం దక్షిణాసియాను ఫొటో తీయగలదు. భారత ఉపఖండం మొత్తాన్ని కేవలం 10 నిమిషాలకు ఒకసారి చిత్రీకరించి పంపగలదు.
