గౌహతిలో పేలుడుపై హోంమంత్రి ఆరా : సీఎంతో మాట్లాడిన రాజ్‌నాథ్

  • Publish Date - May 16, 2019 / 04:18 AM IST

ఢిల్లీ : అసోంలోని   గౌహతి నగరంలో జరిగిన పేలుడు ఘటనపై గురువారం (మే 16) కేంద్ర  హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆరా తీశారు.  మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అసోం సీఎం సర్బానంద సోనోవాల్ తో ఫోన్ లో మాట్లాడారు. పేలుడు ఘటన అనంతరం శాంతిభద్రతల పరిస్థితిపై సమీక్షించారు. 

ఈ ఘటనకు సంబంధించిన కారణాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారని సర్బానంద రాజ్ నాథ్ సింగ్ కు  తెలిపారు. ఈ సందర్భంగా పేలుడులో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ కోరారు. కాగా గౌహతి నగరంలోని జూ రోడ్డులో షాపింగ్ మాల్ వెలుపల బుధవారం (మే 15) రాత్రి 8 గంటలకు జరిగిన గ్రెనెడ్ పేలుడు ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని గౌహతి పోలీసు కమిషనర్ దీపక్ కుమార్ చెప్పారు. బైక్ పై వచ్చిన వారు గ్రెనెడ్ పేల్చారని కమిషనర్ దీపక్ కుమార్ అనుమానం వ్యక్తం చేశారు. పేలుడు ఘటన అనంతరం పోలీసులు అప్రమత్తమై ముమ్మరంగా గాలిస్తున్నారు. కాగా  ఈ పేలుడులో ఇద్దరు మృతి చెందగా మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ గ్రెనేడ్ దాడి తామే చేసినట్లు యూనైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోం ప్రకటించుకున్న విషయం తెలిసిందే.