పంజాబ్ – ఢిల్లీ : ట్రాక్టర్ ను రివర్స్ లో నడిపిన రైతు

tractor in reverse gear : ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు కదం తొక్కుతున్నారు. కొత్తగా తెచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ హస్తినలో ఆందోళనలు చేస్తున్న రైతన్నలకు దేశ వ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. వేలాది మంది మ‌హారాష్ట్ర రైతులు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కదం తొక్కారు. అకుంఠిత దీక్షతో పాదయాత్రగా సాగుతున్నారు. నాసిక్‌ నుంచి ముంబై వరకు చేరుకుంటున్నారు. ఆల్ ఇండియా కిసాన్‌ సభ నేతృత్వంలో జరుగుతున్న ఈ ర్యాలీలో వేలాది మంది రైతులు స్వచ్ఛందంగా భాగస్వాములయ్యారు.

ఇదిలా ఉంటే..ఓ రైతు ట్రాక్టర్ నడుపుకుంటూ..రాజధాని ఢిల్లీకి బయలుదేరాడు. అందరిలాగా..కాకుండా..రివర్స్ గా నడుపుతూ..రావడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ట్విట్టర్ లో పోస్టు చేసిన వీడియో వైరల్ గా మారింది. ప్రధాని నరేంద్ర మోడీ వెంటనే రైతు చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ..రివర్స్ డ్రైవింగ్ చేస్తున్నట్లు ట్రాక్టర్ బ్యానర్ పై రాశాడు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా..పంజాబ్, హర్యానా, ఉత్తర్ ప్రదేశ్ రైతులు గత సంవత్సరం నవంబర్ నెల నుంచి ఆందోళనలు చేపడుతున్నారు. చట్టాలను ఉపసంహరించుకొనేదాక ఆందోళన ఆపమని ఖరాఖండిగా చెబుతున్నారు.

కేంద్రం, రైతు సంఘాల మధ్య జరుగుతున్న చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది. ఈ క్రమంలో..గణతంత్ర దినోత్సవం (జనవరి 26) రోజున..ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించాలని తలపెట్టారు. ఇందులో వేలాది మంది రైతులు పాల్గొనున్నారు. ఘాజీపూర్, సింఘు, టిక్రి సరిహద్దుల నుంచి ర్యాలీ ప్రారంభం కానుంది. ఢిల్లీ సరిహద్దులో ఉన్న సింఘు, టిక్రీ, ఘజియాబాద్‌లలో ఈ ర్యాలీ మొదలై ఢిల్లీ ప్రధాన రహదారుల్లో వంద కిలోమీటర్ల వరకు సాగనుంది. ఇప్పటికే ఢిల్లీ సరిహద్దుల్లో ట్రాక్టర్ల ర్యాలీ రిహార్సల్స్‌ నిర్వహించారు. ఈ ర్యాలీలో మొత్తం దాదాపు 3 లక్షల ట్రాక్టర్లు పాల్గొనే అవకాశమున్నట్లు తెలుస్తోంది.