UP Police: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అతిపెద్ద పోలీసు రిక్రూట్ మెంట్ డ్రైవ్ లో అరుదైన ఘటన చోటు చేసుకుంది. తండ్రీ కొడుకులు సత్తా చాటారు. ఒకేసారి ఇద్దరూ యూపీ పోలీస్ ఎగ్జామ్ క్లియర్ చేశారు. కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. రెండేళ్లు కలిసి ఎగ్జామ్ కు ప్రిపేర్ అయిన తండ్రీ కొడుకులు.. ఎగ్జామ్ పాస్ అవడం, జాబ్ కి సెలెక్ట్ అవడం జరిగిపోయాయి. తండ్రి వయసు 41 ఏళ్లు. రిటైర్డ్ ఆర్మీ హవల్దార్. కొడుకు వయసు 21 ఏళ్లు. తండ్రి, కొడుకు కలిసి కానిస్టేబుళ్లుగా నియమితులు కావడం విశేషం. రాష్ట్రంలో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద పోలీస్ రిక్రూట్ మెంట్ డ్రైవ్ ఇదే. ఇందులో వీరి నియామకం జరిగింది.
ఈ వారం లక్నోలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నుండి నియామక లేఖలు అందుకున్న 60వేల మంది అభ్యర్థులలో హాపూర్‌కు చెందిన మాజీ ఆర్మీ హవల్దార్ యశ్‌పాల్ సింగ్, అతడి కుమారుడు శేఖర్ నగర్ ఉన్నారు.
16 సంవత్సరాల సర్వీస్ తర్వాత 2019లో ఆర్మీ నుండి స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్న యశ్ పాల్.. మొదట్లో సాధారణ పౌరుడిలా జీవితం గడపాలని అనుకున్నారు. ఢిల్లీలోని ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్‌లో కొంతకాలం పనిచేసిన ఆయన ఇంట్లో నెమ్మదిగా స్థిరపడ్డారు. దాదాపు అదే సమయంలో, అతడి కొడుకు 18 ఏళ్ల వయసులో పాఠశాల నుండి బయటకు వచ్చిన శేఖర్.. పోలీసు వృత్తికి సిద్ధం కావడం ప్రారంభించాడు.
పోలీస్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్న కొడుక్కి తండ్రి గైడ్ చేశాడు. అదే సమయంలో ఆయన కూడా పరీక్షలకు ప్రిపేర్ అవుతాడు. ఇదంతా అనుకోకుండా జరిగిపోయింది. ఇద్దరూ ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లోని ఒకే కోచింగ్ సెంటర్‌లో చేరారు. రెండేళ్లు ఇద్దరూ ప్రిపేర్ అయ్యారు. ఒకే సిలబస్‌ను చదివారు, పరీక్షలకు హాజరయ్యారు. శేఖర్ మొదట్లో తనకు ఎదురైన ఇబ్బందిని గుర్తుచేసుకున్నాడు. “ప్రారంభంలో, నాన్నతో ఒకే తరగతిలో కూర్చోవడం నాకు చాలా ఇబ్బందిగా ఉండేది, కానీ నెమ్మదిగా నేను దాన్ని అధిగమించాను” అని చెప్పాడు.
ప్రిపరేషన్ సమయంలో తండ్రీ కొడుకులు ఒకరికొకరు సహకరించుకున్నారు. తండ్రి ఒక దాంట్లో ప్రతిభావంతుడు కాగా కొడుకు మరొక సబ్జెక్ట్ లో నిష్ణాతుడు. ప్రిపరేషన్ లో వారికి ఇది బాగా ఉపయోగపడింది. యశపాల్ జనరల్ నాలెడ్జ్, క్రమశిక్షణలో రాణించాడు. శేఖర్ తన తండ్రికి లాజికల్ రీజనింగ్, న్యూమరికల్ సెక్షన్స్ లో సాయం చేశాడు. అలా ఇద్దరూ బాగా ప్రిపేర్ అవడం, ఎగ్జామ్ కూడా పాస్ అవడం, పోలీస్ ఉద్యోగాలకు సెలెక్ట్ అవడం.. ఇలా అన్నీ చకచకా జరిగిపోయాయి. తండ్రి యశ్ పాల్ షాజహాన్‌పూర్ లో, శేఖర్ బరేలీలో ట్రైనింగ్ తీసుకోబోతున్నారు.