Village
ప్రజలకు న్యాయం చేయాల్సిన పోలీసులు వసూలు రాజాల అవతారం ఎత్తారు. ఓ పంచాయితీ పెద్దను బెదిరించి లక్షల రూపాయలు వసూలు చేశారు. ఈ ఘటన ఉత్తరప్రేశ్ లోని ఢాకియా గ్రామంలో జరిగింది. ఢాకియా గ్రామ పెద్ద ఛత్తపాల్ తన కారులో ఆదివారం (డిసెంబర్ 8)పనిమీద బైటకు వెళ్లాడు. తిరిగి వస్తుండగా ఇద్దరు ఇన్పెక్టర్లతో సహా ఐదుగురు పోలీసులు ఛత్రపాల్ కారును అడ్డుకున్నారు.
తరువాత కారుతో సహా ఛత్రపాల్ ను అక్కడకు దగ్గరలో ఉన్న ఐథియా అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ ఛత్రపాల్ కారులో మాదకద్రవ్యాలను పెట్టి ఫోటోలు..వీడియోలు తీశారు. తరువాత పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. తమకు రూ.7 లక్షలు ఇవ్వాలని..ఇవ్వకపోతే మాదకద్రవ్యాలను తరలిస్తున్నావనీ కేసు పెడతామని బెదిరించారు. దీంతో భయపడిన ఛత్రపాల్ పోలీసులకు ఇచ్చుకుని బైటపడాల్సి వచ్చింది.
ఆ తర్వాత ఛత్రపాల్ ఐదుగురు పోలీసులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తూ ఓ లెటర్ రాశాడు. దీనిపై ఎస్పీ శైలేశ్ పాండే మాట్లాడుతూ..దీనిపై దర్యాప్తు ప్రారంభించామనీ…ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీస్ ఇన్స్పెక్టర్స్ నితిన్ శర్మ, ముఖేశ్‌కుమార్, కానిస్టేబుళ్లు దేవేంద్రకుమార్, ధనుంజయ్‌తోపాటు హోంగార్డుపై కేసు నమోదు చేసి..వారిని సస్పెండ్ చేశామని తెలిపారు.