భయపడినట్టే జరిగింది. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న చైనా వ్యాధి Corona virus భారత్ లోకి ప్రవేశించింది. మన దేశంలోని కేరళ రాష్ట్రంలో తొలి కరోనా కేసు నమోదైంది. చైనాలోని
భయపడినట్టే అయ్యింది. ఏదైతే జరక్కూడదని అంతా దేవుడిని ప్రార్థించారో అదే జరిగింది. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న చైనా వ్యాధి Coronavirus భారత్ లోకి ప్రవేశించింది. మన దేశంలోని కేరళ రాష్ట్రంలో తొలి కరోనా కేసు నమోదైంది. చైనాలోని వూహన్(wuhan) యూనివర్సిటీలో చదువుతున్న కేరళ విద్యార్థికి కరోనా వైరస్ సోకింది. కరోనా వైరస్ సోకినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ధ్రువీకరించింది. విద్యార్థిని వైద్య బృందం పర్యవేక్షణలో ఉంచారు. ప్రస్తుతం రోగి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. కేరళ రాష్ట్రంలో కరోనా వైరస్ అనుమానాలతో 400మందికి పైగా వ్యక్తులను ఇళ్లలోనే ఉంచారు. డాక్టర్ల పర్యవేక్షణలో వారంతా ఉన్నారు. ఇక ఢిల్లీ, ముంబై నగరాల్లోని ఆసుపత్రుల్లో ఐసోలేషన్ వార్డుల్లో ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు.
చైనాకి వెళ్లొచ్చిన వారు జాగ్రత్త:
2020 జనవరి 1 వరకు ఎవరెవరు చైనాలో పర్యటించి వచ్చారో వారందరూ జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య శాఖ హెచ్చరించింది. జలుబు, జ్వరం, శాసలో ఇబ్బందులు వంటి లక్షణాలు ఉంటే.. వెంటనే సమీపంలోని ఆసుపత్రుల్లో కరోనా వైరస్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స చేయించుకోవాలని ఆరోగ్య శాఖ అధికారులు సూచించారు. కాగా, దేశంలోని పలు విమానాశ్రయాల్లో ఇప్పటివరకు 30వేల మందికిపైగా ప్రయాణికులను స్క్రీనింగ్ చేశారు.
ఆందోళనలో భారతీయులు:
దేశంలో తొలి కరోనా కేసు కేరళ రాష్ట్రంలో నమోదైందన్న వార్త భారతీయుల్లో కలకలం రేపుతోంది. ఎందుకంటే ఇప్పటివరకు కరోనా వైరస్ కి ట్రీట్ మెంట్ లేదు. మెడిసిన్ లేదు. వైరస్ సోకితే ప్రాణాలు పోతున్నాయి. ఇప్పటికే చైనాలో వందలాది మంది ప్రాణాలు ఒదిలారు. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశం చైనాకే.. కరోనా వైరస్ ని నియంత్రించడం సాధ్యం కావడం లేదు. మరి భారత్ దీన్ని ఏ విధంగా ఎదుర్కొంటుంది అనే భయం నెలకొంది.
చైనాలో 250మంది భారతీయులు:
కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో తమ దేశం నుంచి విదేశీయులను సురక్షితంగా పంపేందుకు సిద్ధమని చైనా తెలిపింది. కరోనా వైరస్ తీవ్రంగా ఉన్న వుహన్ నుంచి భారతీయులను తరలించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. హ్యుబయి రాష్ట్రంలో దాదాపు 250 మంది భారతీయులున్నారు. వారిలో విద్యార్థులే అత్యధికం. అయితే, భారత్ వచ్చిన తర్వాత వారంతా 14 రోజుల పాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉండాల్సి ఉంటుంది.
చైనాకు విమాన సర్వీసులు నిలిపివేత:
కరోనా వైరస్ విజృంభణతో చైనాకు తమ సర్వీసులను నిలిపివేస్తున్నట్లు విమానయాన సంస్థలు ఇండిగో, ఎయిర్ ఇండియా ప్రకటించాయి. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 14 వరకు ఢిల్లీ-షాంఘై సర్వీస్‌ను నిలిపేస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. బెంగళూరు-హాంకాంగ్ రూట్ లో ఫిబ్రవరి 1 నుంచి, ఢిల్లీ-చెంగ్డూ రూట్‌లో 14 వరకు సర్వీసులను రద్దు చేశామని ఇండిగో వెల్లడించింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందే అత్యంత అధిక అవకాశాలు ఉన్న 30 దేశాల్లో భారత్ ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. చైనాలో కరోనా వైరస్ బారినపడ్డ నగరాల నుంచి ఎక్కువ సంఖ్యలో విమాన ప్రయాణికులు ఈ 30 దేశాలకు ప్రయాణిస్తున్నారని తెలిపారు. దీని వల్ల ఈ 30 దేశాలకు కరోనా వైరస్ సోకే ప్రమాదం ఉందని గుర్తించారు. అత్యంత ప్రమాదకర దేశాల్లో తొలి 3 స్థానాల్లో థాయ్ లాండ్, జపాన్, హాంకాంగ్ ఉండగా.. అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్, భారత్‌లు ఉన్నాయి.
170మంది మృతి, 8వేల కేసులు నమోదు:
చైనాలోని వూహన్ నగరంలో పుట్టిన Coronavirus.. క్రమంగా ఇతర దేశాలకూ వ్యాపిస్తోంది. ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకి 170 మంది ప్రాణాలు కోల్పోగా, వైరస్ సోకినవారి సంఖ్య 8వేలకు చేరిందని చైనా ప్రభుత్వం తెలిపింది. మరోవైపు కరోనా వైరస్ లక్షణాలున్నాయనే అనుమానంతో హైదరాబాద్‌లోని ఫీవర్ ఆస్పత్రిలో చేరిన ముగ్గురిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. కరోనా లక్షణాలతో 3 రోజుల క్రితం ఒకే కుటుంబానికి చెందిన ఈ ముగ్గురూ చికిత్స కోసం ఫీవర్ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే.
Also Read : కరోనా వైరస్ గురించి బ్రహ్మం గారి కాలజ్ఞానంలో అప్పుడే చెప్పారా ?