భారత్ లో తొలి కరోనా మృతుడు…హైదరాబాద్‌లో ఆరు రోజులు గడిపాడు

కరోనా మహమ్మారి భారత్‌లో ఒకరిని బలితీసుకుంది. సౌదీ నుంచి అతడు నేరుగా హైదరాబాద్‌ పాతబస్తీలోని బంధువులు ఇంటికి వచ్చాడు.

  • Publish Date - March 13, 2020 / 04:09 AM IST

కరోనా మహమ్మారి భారత్‌లో ఒకరిని బలితీసుకుంది. సౌదీ నుంచి అతడు నేరుగా హైదరాబాద్‌ పాతబస్తీలోని బంధువులు ఇంటికి వచ్చాడు.

కరోనా మహమ్మారి భారత్‌లో ఒకరిని బలితీసుకుంది. దీంతో దేశంలో తొలి కరోనా మరణం నమోదైంది. మృతుడు కర్నాట రాష్ట్రంలోని కల్‌బుర్గికి చెందిన 76ఏళ్ల సిద్దిఖి. సిద్ధిఖి ఈనెల పదో తేదీనే మరణించినా… అతడికి కరోనా పాజిటివ్‌గా ఉన్నట్టు రిపోర్ట్‌లు నిన్ననే అందాయి. దీంతో అందరిలోనూ ఆందోళన మొదలైంది.

కలబుర్గికి చెందిన మహ్మద్‌ సిద్ధిఖి జనవరి 29న సౌదీకి పని నిమిత్తం వెళ్లాడు. పని ముగించుకుని నెల రోజుల తర్వాత అంటే ఫిబ్రవరి 29న భారత్‌కు వచ్చాడు. సౌదీ నుంచి అతడు నేరుగా హైదరాబాద్‌ పాతబస్తీలోని బంధువులు ఇంటికి వచ్చాడు. అక్కడే  మార్చి 5 వరకు ఉన్నాడు. ఈనేపథ్యంలో సిద్ధిఖి అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో అతడు జూబ్లీహిల్స్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నాడు. 

సిద్ధిఖి హైదరాబాద్‌ నుంచి ఈనెల 6న తన సొంతప్రాంతమైన కర్నాటకలోని కల్‌బుర్గికి పయనమై వెళ్లాడు. అక్కడికి వెళ్లిన తర్వాత మరోసారి అనారోగ్యానికి గురయ్యాడు. తీవ్రంగా జ్వరం, జలుగు, దగ్గు రావడంతో స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిని ఆశ్రయించాడు. దీంతో అక్కడి వైద్యులు కరోనా లక్షణాలు ఉన్నాయని అనుమానించి శాంఫిల్స్‌ పుణెకు పంపారు. ఈనెల పదిన అతడు చనిపోయాడు.

సిద్ధిఖి రిపోర్ట్‌ పుణె నుంచి వైద్యులకు నిన్న అందాయి. సిద్ధిఖికి కరోనా సోకినట్టు రిపోర్ట్‌లో వెల్లడైంది. దీంతో కర్నాటక ప్రభుత్వం అప్రమత్తమైంది. అతడు నివసించిన ప్రాంతంలోని వారందరినీ అలర్ట్‌ చేసింది. ఆస్పత్రి సిబ్బందిని అప్రమత్తం చేసింది. సిద్దిఖి హైదరాబాద్‌లో  ఆరురోజులపాటు ఉండడంతో తెలంగాణ సర్కార్‌ను అప్రమత్తం చేసింది.

కర్నాటక ప్రభుత్వం ఇచ్చిన సమాచారంతో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్‌ అయ్యింది. సిద్ధిఖి హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ తిరిగాడు, ఎవరెవరినీ కలిశాడు అన్నదానిపై సమాచారం సేకరిస్తోంది. అంతేకాదు.. సిద్దిఖీ బంధువులు ఎవరన్నదానిపై కూపీ లాగుతోంది. పాతబస్తీలోని సిద్ధిఖి బంధువులకు,ఆ చుట్టుపక్కల ఉన్న వారికి పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నట్టు సమాచారం. 

ఇవాళ వారందరినీ గాంధీ ఆస్పత్రికి తరలించనున్నట్టు తెలుస్తోంది. వారి రిపోర్ట్‌లు వచ్చే వరకు ఐసోలేషన్‌ వార్డులో ఉంచే అవకాశముంది.అంతేకాదు.. అతడు ఏయే ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నాడో గుర్తించి.. అక్కడి సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించే అవకాశముంది. ఇప్పటికే అధికారులు ఆ పనిలో నిమగ్నమయ్యారు. సిద్ధిఖీ కలిసిన వారి డేటాను సమీకరిస్తున్నారు. (బెంగళూరులో మరో కరోనా కేసు.. గూగుల్ ఉద్యోగికి పాజిటివ్ )