FM Nirmala Sitharaman Says I Speak Hindi With Lot Of Hesitation and The Language Gives Me Shivers
Nirmala Sitharaman: హిందీలో మాట్లాడాలంటే తనకు భయమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. తమిళనాడులో పుట్టడమే కాకుండా హిందీకి వ్యతిరేకంగా పెద్ద ఆందోళన కొనసాగుతున్న పరిస్థితుల మధ్య పెరిగానన్న ఆమె.. ఆ సమయంలోనే హిందీ అంటే భయం పట్టుకుందని, ఇప్పటికీ అదే ఆందోళన ఉంటుందని అన్నారు. గురువారం వివేక్ అనే హిందీ మ్యాగజైన్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రసంగించారు.
‘‘నాకు హిందీలో మాట్లాడాలంటే భయం. ఎందుకంటే నేను పుట్టింది తమిళనాడులో. హిందీకి వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో కొనసాగిన ఆందోళనలను నేను చూశాను. అవి ఎంతటి హింసాత్మకతకు దారి తీశాయో ఇంకా గుర్తున్నాయి. హిందీ వ్యతిరేక పరిస్థితుల మధ్య పెరిగాను. మేం చదువుకునే రోజుల్లో సెకండ్ లాంగ్వేజ్‌గా హిందీ లేదంటే సంస్కృతం తీసుకున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం స్కాలర్షిప్పులు ఇచ్చేవారు కాదు. హిందీ అంటే అలా భయం ఉండిపోయింది. గత అనుభవాలే కావొచ్చు. ఇప్పటికీ హిందీలో మాట్లాడాలంటే భయం’’ అని అన్నారు.
హిందీలో మాట్లాడాలంటే భయమని చెప్పిన నిర్మలా.. గురువారం నాటి కార్యక్రమంలో హిందీలోనే మాట్లాడారు. ఇక ఇదే కార్యక్రమంలో గత ప్రభుత్వాల పని తీరుపై నిర్మలా విమర్శలు గుప్పించారు. అటల్ బిహారీ వాజిపేయి ప్రభుత్వం అనంతరం దేశంలో అభివృద్ధి ఆగిపోయిందని, రెండుసార్లు యూపీఏ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి శూన్యమని అన్నారు. నరేంద్రమోదీ ప్రధానమంత్రి అయ్యాక అభివృద్ధికి నూతన దారులు పడ్డాయని నిర్మలా అన్నారు.