బ్లాక్ మెయిలింగ్ కేసులో న్యూస్ ఛానల్ ఎండీ అరెస్ట్

ఛానల్ లో వేస్తే మీ పరువు పోతుందంటూ భయపెట్టటం మొదలుపెట్టాడు. ఈ వీడియో బయటకు రాకుండా ఉండాలి అంటే 50 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అది మార్ఫింగ్ వీడియో

  • Publish Date - May 6, 2019 / 09:47 AM IST

ఛానల్ లో వేస్తే మీ పరువు పోతుందంటూ భయపెట్టటం మొదలుపెట్టాడు. ఈ వీడియో బయటకు రాకుండా ఉండాలి అంటే 50 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అది మార్ఫింగ్ వీడియో

డబ్బు కోసం ఎమ్మెల్యేనే బెదిరించి.. బ్లాక్ మెయిలింగ్ చేస్తున్న ఓ న్యూస్ ఛానల్ ఎండీని అరెస్ట్ చేశారు పోలీసులు. బెంగళూరులో కలకలం రేపుతున్న ఈ కేసు వివరాలు చూద్దాం. ఫోకస్ అనే న్యూస్ ఛానల్ ఉంది. దానికి ఎండీ హేమంత్. ఇతను కొన్ని రోజులుగా బెంగళూరు సిటీ పరిధిలోని మహదేవపూర్ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ లింబావలిని బ్లాక్ మెయిల్ చేశారు.
కేసు ఏంటీ :
2018, మే నెలలో రఘు మౌర్య అనే వ్యక్తి.. బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ రాసలీలలు అంటూ ఓ మార్ఫింగ్ వీడియోను ఫేస్ బుక్ లో పెట్టాడు. ఆ తర్వాత 2 రోజులకు దాన్ని రఘునే డిలీట్ చేశాడు. సోషల్ మీడియా నుంచి స్వయంగా తొలగించటంతో వెలుగులోకి రాలేదు. అయితే ఆ వీడియోను ఫోకస్ టీవీ ఎండీ హేమంత్ సంపాదించాడు. ఈ వీడియోను అడ్డంపెట్టుకుని బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ లింబావలిని బ్లాక్ మెయిల్ చేశాడు. ఈ వీడియో కోసం సీఎం ఆఫీస్ నుంచి కూడా ఒత్తిడి ఉందని.. ఛానల్ లో వేస్తే మీ పరువు పోతుందంటూ భయపెట్టటం మొదలుపెట్టాడు. ఈ వీడియో బయటకు రాకుండా ఉండాలి అంటే 50 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అది మార్ఫింగ్ వీడియో అని.. వాస్తవం కాదంటూ ఎమ్మెల్యే చెబుతూ వచ్చాడు. డబ్బులు ఇవ్వటానికి నిరాకరించాడు. అయినా న్యూస్ ఛానల్ ఎండీ హేమంత్ మాత్రం వదల్లేదు.
ఈ బెదిరింపుల సమయంలోనే ఎమ్మెల్యే అరవింద్ అసిస్టెంట్ భరద్వాజ.. మే 2వ తేదీన బెంగళూరు వెట్ ఫీల్డ్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. దీనిపై ప్రాథమిక విచారణ చేసిన బెంగళూరు సిటీ కమిషనర్ సునీల్ కుమార్.. కేసును సెంట్రల్ క్రైం బ్రాంచ్ కు బదిలీ చేశారు. వారు మే 5వ తేదీ ఆదివారం రాత్రి ఛానల్ ఎండీ హేమంత్ ను అరెస్ట్ చేశారు.
అతనిపై సెక్షన్ 356, 384, 506, 204, ఐటీ యాక్ట్ కింద కేసులు పెట్టి కోర్టులో హాజరుపరిచారు. అనంతరం పోలీస్ కస్టడీకి తీసుకున్నారు బెంగళూరు సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసులు. గతంలో ఇంకెవరినైనా ఇలాగే బెదిరించారా.. డబ్బులు వసూలు చేశారా అనే విషయాలపై ఆరా తీస్తున్నారు.

హేమంత్ తోపాటు ఈ కేసులో మిగతా వాళ్ల పాత్ర ఉంటే వారినీ విచారించనున్నట్లు వెల్లడించారు పోలీసులు. ఫోకస్ టీవీ ఛానల్ ఎండీ అరెస్ట్ కలకలం రేపుతోంది. మీడియాలో చర్చనీయాంశం అయ్యింది. ఛానల్ ద్వారా తీవ్ర నష్టాలు రావటంతో.. కొన్ని రోజుల క్రితం ఫోకస్ టీవీని మూసివేశారు.