Former CM Yediyurappa is once again in trouble
Yediyurappa: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ కేంద్ర పార్లమెంటరీ బోర్డు సభ్యుడు యడియూరప్ప మరోసారి చిక్కుల్లో పడ్డారు. ఆయన కుటుంబీకుల అవినీతిపై హైకోర్టు తాజాగా విచారణకు ఆదేశించింది. సామాజిక కార్యకర్త టీజే అ బ్రహాం గతంలో యడియూరప్ప అవినీతిపై విచారణ జరపాలని కోర్టులో పిటీషన్ దాఖలు చేయగా ప్రాసిక్యూషన్ నుంచి అనుమతులు లభించనందున కేసును కొట్టివేశారు. కాగా అదే కేసును విచారణకు హైకోర్టు బుధవారం ఆదేశించింది.
ఈ కేసులో యడియూరప్పతో పాటు ఆయన కుమారుడు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీవై విజయేంద్ర, బంధువులు శశిధర్ మరడి, సంజయ్‌శ్రీ, చంద్రకాంత్ రామలింగం, సహకార శాఖ మంత్రి ఎస్‌టీ సోమశేఖర్, డాక్టర్ జేసీ ప్రకాష్, కే రవి, విరూపాక్షప్ప యమకనమరడి ఉన్నారు. కాగా, హైకోర్టు ధర్మాసనం విచారణకు ఆదేశించడంపై సవాలు చేస్తూ యడియూరప్ప తరపు న్యాయవాది సందీప్ పాటిల్ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలుకు గడువు కోరారు.
కర్ణాటక బీజేపీని ఇప్పటికే అనేక అవినీతి ఆరోపణలు వెంటాడుతున్నాయి. ఇలాంటి తరుణంలో మూలుగుతున్న నక్క మీద తాటి పండు పడ్డట్లు ముగిసిందనుకున్న కేసు మళ్లీ విచారణకు రావడం పార్టీని చాలా ఇబ్బందికి గురి చేస్తోంది. ఈ విషయమై సుప్రీం వెళ్తామని చెప్తున్నప్పటికీ.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి క్లీన్ చిట్ రాకపోతే పార్టీ చాలా నష్టపోవాల్సి ఉంటుందని అంటున్నారు.