భారత్‌లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఆరోగ్యం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకునే సీఎంలు, కేంద్రమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా కోవిడ్ బారినపడుతున్నారు. తాజగా గోవా సీఎం ప్రమోద్ సావంత్‌కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. వైరస్ లక్షణాలు లేనందున స్వీయ నిర్బంధంలోకి వెళ్తున్నట్లు సావంత్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.
నాకు కరోనా సోకినట్లు తేలింది. ఎలాంటి లక్షణాలూ లేకపోవడంవల్ల డాక్టర్ల సలహా మేరకు స్వీయ నిర్బంధంలోకి వెళ్తున్నా. ఇంటి నుంచే విధులను నిర్వర్తిస్తాను. ఇటీవల నన్ను కలిసిన వారంతా పరీక్షలు చేయించుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సలహా ఇస్తున్నా అంటూ సీఎం ప్రమోద్ సావంత్ ట్వీట్ లో తెలిపారు. కాగా, గోవాలో ఇప్పటి వరకు 18వేలకుపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 194 మంది ప్రాణాలు కోల్పోయారు.
మరోవైపు, దేశంలో ఇప్పటివరకు కరోనా బారినపడిన నాలుగో సీఎంగా ప్రమోద్ సావంత్ నిలిచారు. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్,కర్నాటక సీఎం యడియూరప్ప,హరియాణా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్‌కు కరోనా సోకింది. వీరిలో ఇప్పటికే యడియూరప్ప, శివరాజ్ సింగ్ పూర్తిగా కోలుకున్నారు. కరోనా బారినపడిన నలుగురు సీఎంలు బీజేపీకి చెందిన వారే కావడం గమనార్హం.
రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ కుమారుడికి కూడా
https://10tv.in/92-people-tested-corona-positive-who-went-to-take-pensions-in-wanaparthy/
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కుమారుడు, నోయిడా ఎమ్మెల్యే పంకజ్‌సింగ్ కు కరోనా సోకినట్లు తేలింది. వ్యాధి లక్షణాలు కనిపించడం వల్ల పంకజ్‌కు పరీక్ష చేయగా.. కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయిందని మంగళవారం రాత్రి పంకజ్ సింగ్ తెలిపారు. దీంతో డాక్టర్ల సూచన మేరకు ఆస్పత్రిలో చేరుతున్నట్టు తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారంతా పరీక్షలు చేయించుకోవాలని పంకజ్
సూచించారు.