Online Pind Daan Scheme
Online Pind Daan Scheme : బీహార్ పర్యాటక శాఖ ఇటీవల ప్రారంభించిన ఆన్‌లైన్ పిండదాన స్కీమ్ గయలో పెద్ద వివాదాన్ని సృష్టించింది. సాంప్రదాయ భాగస్వాములు, ముఖ్యంగా (Online Pind Daan Scheme) గయలోని గైవాల్ పాండా సమాజ్, విశ్వ హిందూ పరిషత్ (VHP) ఈ పథకాన్ని మత సంప్రదాయాలకు విరుద్ధమని పేర్కొన్నాయి. పర్యాటక శాఖ పథకం కింద పితృ పక్ష సమయంలో గయకు రాలేని వారు రూ. 23 వేల ఒకేసారి రుసుము చెల్లించడం ద్వారా పాండా పూజారుల ద్వారా పిండదానాన్ని చేయించుకోవచ్చు.
ఈ ఆచారాల వీడియో రికార్డింగ్‌లు పెన్ డ్రైవ్‌లలో అందుబాటులో ఉంచుతారు. ఇందుకోసం ఆన్‌లైన్ పోర్టల్ కూడా క్రియేట్ చేశారు. సెప్టెంబర్ 6 నుంచి ప్రారంభం కానున్న పితృపక్ష ఉత్సవం కోసం ఈ స్కీమ్ ప్రారంభమైంది. కానీ, ఆదిలోనే వ్యతిరేకిత మొదలైంది.
అయితే, ఈ చర్యను అనేక సంస్థలు, స్థానిక పాండా సంఘం వ్యతిరేకించాయి. గయా టౌన్ ఎమ్మెల్యే, సహకార మంత్రి ప్రేమ్ కుమార్ పాండా సంఘం అభ్యంతరాలను అంగీకరించారు. వారి మనోభావాలను గౌరవిస్తామని, ఈ విషయాన్ని ఉన్నత స్థాయిలో సమీక్షిస్తామని చెప్పారు.
మత గ్రంథాలకు విరుద్ధం :
ఈ పథకం మత గ్రంథాలకు విరుద్ధమని వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు మణిలాల్ బారిక్ అభివర్ణించారు. గరుడ పురాణం ప్రకారం.. పిండ దానాన్ని నేరుగా ఒక కుమారుడు లేదా పురుష వంశస్థుడు మాత్రమే నిర్వహించగలరని ఆయన అన్నారు. విష్ణుపాద, ఫాల్గు, అక్షయవత్ వంటి నిర్దిష్ట పూజా స్థలాలలో మాత్రమే నిర్వహించాలి. పరోక్షంగా చేసే పిండ దానాన్ని శాస్త్రాలకు విరుద్ధమని, వ్యతిరేకంగా నిరసనను తెలియజేస్తున్నాయని అన్నారు.
వారికి మాత్రమే అధికారం :
విష్ణుపద్ ప్రబంధక్ కమిటీ అధ్యక్షుడు శంభు లాల్ బిత్తల్ పర్యాటక శాఖ ఒక మతపరమైన కార్యక్రమాన్ని వాణిజ్యపరం చేస్తోందని ఆరోపించారు. గైవాల్ పాండాలకు మాత్రమే పిండదానం చేయడానికి అధికారం ఉందని, ఈ పథకంలో పాండా బ్రాహ్మణులు కాని వారిని కూడా ‘పురోహితులు’గా చేర్చారని ఆయన అన్నారు.
నిరసనలు పెరుగుతున్న కొద్దీ, ఆన్‌లైన్ పిండదానం పథకం భవిష్యత్తు అనిశ్చితి నెలకొంది. సాంప్రదాయ విలువలు, శాస్త్రీయ సూచనలను దృష్టిలో ఉంచుకుని ఈ స్కీమ్ నిలిపివేయాలని మత నాయకులు, భక్తులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.