పనివేళల్లో మార్పు: షాక్ ఇవ్వనున్న కేంద్ర ప్రభుత్వం

కార్మికులకు మోడీ గవర్నమెంట్ షాక్ ఇచ్చింది. పనిగంటల మార్పు చేయనున్నట్లు ముసాయిదా బిల్లులో కేంద్ర కార్మిక శాఖ ప్రతిపాదనలు చేసింది. జాతీయ కనీస వేతనాన్ని నిర్ణయించడానికి మాత్రం ఆసక్తి చూపలేదు. దీనికి కార్మిక సంఘాల నుంచి పూర్తి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సాధారణ పని దినాలలో రోజుకు తొమ్మిది గంటల పాటు పనిచేయాలని పేర్కొంటూ ముసాయిదాపై ప్రజాభిప్రాయ సేకరిస్తున్నారు. లేబర్ కోడ్ మాదిరిగా కనీస వేతనాల విషయంలో నిర్ణయాన్ని నిపుణుల కమిటీకే వదిలేశారు. 

జాతీయ కనీస వేతన చట్టం ప్రకారం.. ఈ ఏడాది జనవరిలో కేంద్ర కార్మిక శాఖలోని అంతర్గత వ్యవహారాల కమిటీ జులై 2018 నుంచి రోజుకు రూ.375 చెల్లించాలని నివేదిక ఇచ్చింది. అంతేకాకుండా నెలకు రూ.9వేల 750 కనీస వేతనం చెల్లించాలని ఏడుగురు సభ్యులు కమిటీ సిఫార్సు చేసింది. వీటితో పాటుగా నగరాల్లో పనిచేసే కార్మికులకు హెచ్‌ఆర్ఏ రూ.వెయ్యి 430 అదనంగా అందజేయాలని సూచించింది. ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం ముసాయిదా డిసెంబరు నాటికి ఓ నిర్ణయానికి వస్తుంది. 

ముసాయిదాలో మెట్రో పాలిటన్, నాన్ మెట్రో పాలిటన్, గ్రామీణ ప్రాంతాలుగా విభజించి నిబంధనలు రూపొందించారు. 40 లక్షలు అంత కంటే ఎక్కువ జనాభా ఉంటే మెట్రోపాలిటిన్ నగరాలు, 10 నుంచి 40 లక్షలలోపు జనాభా ఉంటే నాన్-మెట్రోపాలిటిన్ నగరాలు, అంతకంటే తక్కువ ఉంటే గ్రామీణ ప్రాంతాలుగా పేర్కొన్నారు. కనీస హెచ్ఆర్ఏ 10శాతం ఉండగా నగరాల వర్గం ఆధారంగా ఇది మారుతుందా అనే దానిపై స్పష్టత ఇవ్వలేదు.